
ప్రతి మనిషి జీవితంలో ఆనందం, శాంతి కావాలని కోరుకుంటాడు. కానీ చాలా మందికి ఆ ఆనందం దక్కకుండా, తెలియకుండానే దుఃఖం వెంటాడుతుంది. ఈ దుఃఖానికి కారణం బాహ్య పరిస్థితులు కాదు, మనలోని కొన్ని చెడు లక్షణాలే అని విదురుడు స్పష్టంగా చెప్పారు.
విదుర నీతి ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని చెడు గుణాలను అలవర్చుకుంటే.. అతడు ఆనందాన్ని కోల్పోయి, జీవితాంతం బాధతో జీవించాల్సి వస్తుంది. అందుకే ఈ లక్షణాలను వదిలేయాలని విదురుడు హెచ్చరిస్తాడు.
ఇతరుల విజయాలను, ఆనందాన్ని చూసి ఎప్పుడూ అసూయపడే వ్యక్తి తన జీవితంలో కూడా సుఖాన్ని పొందలేడు. ఇతరుల ఆనందాన్ని తట్టుకోలేక, తాను తక్కువవాడిననే భావనతో బాధపడతాడు. కానీ బయట మాత్రం తాను బలమైనవాడినని నటిస్తాడు. ఈ అంతర్గత సంఘర్షణ అతన్ని ఎప్పటికీ దుఃఖంలో ఉంచుతుంది.
తన చుట్టూ ఉన్నవారిని తక్కువగా చూసే, ద్వేషంతో నిండిన వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు. తానే గొప్పవాడినన్న అహంకారంతో, ఇతరుల్ని దూరం పెట్టే స్వభావం అతన్ని ఒంటరిని చేస్తుంది. ఈ ఒంటరితనం చివరికి దుఃఖంగా మారుతుంది.
ఎంత సంపాదించినా, ఎంత సాధించినా సంతృప్తి చెందని వ్యక్తి జీవితంలో సుఖం ఉండదు. ఇతరుల జీవితాలను తన జీవితంతో పోల్చుకుంటూ బాధపడటం వల్ల, తన వద్ద ఉన్న మంచి విషయాలను ఆస్వాదించలేడు. అసంతృప్తి అతన్ని ఎప్పటికీ విచారంలో ముంచుతుంది.
ఎప్పుడూ ఇతరులను అనుమానించే వ్యక్తి ఎవరిలోనూ మంచిని చూడలేడు. ప్రతి విషయానికీ లోపాలు వెతకడం, వ్యంగ్యంగా మాట్లాడటం అలవాటవుతుంది. ఈ అనుమాన స్వభావం అతన్ని శాంతి లేకుండా చేసి, జీవితాన్ని విచారంతో నింపుతుంది.
కోపం మనిషిని లోపల నుంచే నాశనం చేస్తుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తి ఏ పనిలోనూ సంతృప్తి చెందడు. కోపంతో నిండిన మనసు ఆనందాన్ని అనుభవించలేక, జీవితాన్ని దుఃఖంతో నింపుకుంటుంది.
జీవితంలో పరస్పర సహకారం అవసరం. కానీ, పూర్తిగా ఇతరులపై ఆధారపడి, స్వతంత్రంగా ఆలోచించలేని వ్యక్తి తన ఉనికినే కోల్పోతాడు. సొంత నిర్ణయాలు తీసుకోలేక, ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల, చిన్న నిర్లక్ష్యమే అతన్ని తీవ్ర దుఃఖంలోకి నెడుతుంది.
విదుర నీతి ప్రకారం.. మనిషి జీవితంలో దుఃఖానికి అసలు కారణం బయటి పరిస్థితులు కాదు, మనలో ఉన్న అసూయ, కోపం, ద్వేషం, అసంతృప్తి, అనుమానం వంటి చెడు గుణాలే. ఈ లక్షణాలను వదిలి, సంతృప్తి, సహనం, స్వతంత్ర ఆలోచన లాంటి మంచి గుణాలను అలవర్చుకుంటేనే నిజమైన ఆనందం లభిస్తుందని విదురుడు బోధిస్తున్నాడు.