Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం పూజ ఎప్పుడు, ఎలా పూర్తి చేయాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Varalakshmi Vratam Puja Rules Telugu: వరలక్ష్మీ వ్రతం పూజను ఏ సమయంలో చేయాలి? తొమ్మిది పూర్ణంబూరెలు తప్పనిసరిగా సమర్పించాలా? తాంబూలంలో ఏమి ఇవ్వాలి? తోరాన్ని ఎలా కట్టాలి, ఎప్పుడు విప్పాలి? వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన సంప్రదాయాలు, నియమాలను ఈ కథనంలో తెలుసుకోండి.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం పూజ ఎప్పుడు, ఎలా పూర్తి చేయాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Varalakshmi Vratam Puja Rules

Updated on: Aug 21, 2026 | 11:53 AM

Varalakshmi Vratam Puja Rules Telugu: శ్రావణమాసం వచ్చిందంటే తెలుగు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు, నోములు ఆచరిస్తూ కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీ కాగా.. శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతం రోజున సుమంగళి స్త్రీలు భక్తితో మహాలక్ష్మిని ఆరాధిస్తారు. భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబానికి సుఖసంతోషాలు, సంతానాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజా సమయం నుంచి నైవేద్యాలు, పూలు, తాంబూలం, తోరం వరకు ఎన్నో సందేహాలు ఉంటాయి. పూజను ఎప్పుడు ప్రారంభించాలి? ఏ సమయంలోపు పూర్తి చేయాలి? తొమ్మిది పూర్ణంబూరెలు తప్పనిసరిగా సమర్పించాలా? తోరాన్ని ఎలా కట్టుకోవాలి? వంటి విషయాలను సంప్రదాయాల ప్రకారం తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం పూజను ఏ సమయంలో చేయాలి?

వ్రతం రోజున ఉదయం నుంచే ఇంటి పనులు, పిండివంటలు, అమ్మవారి అలంకరణ, పూజా సామగ్రి సిద్ధం చేయడం వంటి పనులతో మహిళలకు సమయం పడుతుంది. దీంతో పూజను తప్పనిసరిగా ఉదయమే చేయాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆధ్యాత్మికవేత్త ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సంప్రదాయ పద్ధతిలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి, వ్రత ఏర్పాట్లు పూర్తి చేసుకుని, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మరోసారి స్నానం చేసి వ్రతాన్ని ఆచరించే విధానం కూడా ఉంది. ఈ సమయంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ పుష్పాలు, గంధాలతో ఆరాధిస్తారు.

అయితే ప్రతి ఇంటి పరిస్థితులు ఒకేలా ఉండవు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్న కుటుంబాల్లో సాయంత్రం వరకు వేచి ఉండటం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఉదయమే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినా దోషం లేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కాబట్టి సంప్రదాయాన్ని పాటించడంతో పాటు కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా పూజా సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూజలో ఎన్ని రకాల పూలు ఉపయోగించాలి?

వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారిని పుష్పాలతో అలంకరించి పూజించడం విశేషంగా భావిస్తారు. సంప్రదాయ పద్ధతిలో 21 రకాల పూలు, అష్టవిధ గంధాలతో అమ్మవారిని పూజించే విధానం ఉందని చెబుతారు. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలను భక్తితో సమర్పించడం ప్రధానమని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మొగలిరేకులను లక్ష్మీదేవికి ప్రతీకగా భావించే ఆచారం ఉంది. అవి అందుబాటులో లేకపోతే వెండితో తయారు చేసిన మొగలి పూలను ఉపయోగించవచ్చని ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణమూర్తి సూచిస్తున్నారు.

వరలక్ష్మీదేవికి తొమ్మిది పూర్ణంబూరెలు తప్పనిసరిగా పెట్టాలా?

వరలక్ష్మీ వ్రతంలో నైవేద్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శనగపప్పు, బెల్లంతో తయారు చేసే పూర్ణంబూరెలను కనీసం తొమ్మిది సమర్పించే ఆచారం కొన్ని సంప్రదాయాల్లో ఉంది. ఇదే పూర్ణంతో తయారు చేసిన కుడుములను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.
అదేవిధంగా పులుపు, తీపి, కారం వంటి విభిన్న రుచులతో పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేసి అమ్మవారికి నివేదించే సంప్రదాయం ఉంది. ఇంటి ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం ఆధారంగా నైవేద్యాల్లో మార్పులు ఉండవచ్చు. శక్తి, సౌకర్యం ఉన్నవారు లక్ష్మీహోమాన్ని కూడా నిర్వహించుకోవచ్చని చెబుతారు. అమ్మవారితో పాటు సరస్వతీదేవి, పార్వతీదేవి, వినాయకుడిని ఆహ్వానించి పూజించడం కూడా కొన్ని పద్ధతుల్లో కనిపిస్తుంది.

అమ్మవారికి సమర్పించిన చీర, బ్లౌజ్‌పీస్‌ను ఏం చేయాలి?

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని కొత్త చీర, బ్లౌజ్‌పీస్‌తో అలంకరించడం ఆనవాయితీ. అయితే పూజ పూర్తయిన తర్వాత వాటిని తామే ఉపయోగించుకోవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి సూచన ప్రకారం.. మరుసటి రోజు మహాలక్ష్మీదేవికి పూజ చేసి, అమ్మవారిని కదిలించిన అనంతరం ఆమెకు అలంకరించిన చీర, బ్లౌజ్‌పీస్‌ను సువాసిని స్త్రీకి లేదా వ్రతాన్ని చేయించిన వారికి బహుమానంగా ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. అలాగే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా ఉద్యాపన చేయాల్సిన అవసరం లేదని, లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం భక్తితో వ్రతాన్ని కొనసాగించే సంప్రదాయం ఉందని వివరిస్తున్నారు.

తాంబూలం లేదా వాయనంలో ఏమి ఇవ్వాలి?

వరలక్ష్మీ వ్రతంలో సువాసినులకు తాంబూలం ఇవ్వడం కూడా ముఖ్యమైన సంప్రదాయం. శాస్త్రోక్త విధానం ప్రకారం వెదురు బుట్టలో దక్షిణతో పాటు ఐదు రకాల పండ్లు ఉంచి ఇవ్వడాన్ని వాయనంగా పేర్కొంటారు. కొన్ని వ్రతకల్ప సంప్రదాయాల్లో తొమ్మిది పూర్ణంబూరెలను కూడా వాయనంగా ఇవ్వవచ్చని చెబుతారు. ఏ విధానాన్ని పాటించినా తమ కుటుంబ ఆచారం, పెద్దల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వెదురుబుట్టకు ధనానికి ప్రతీక అనే విశ్వాసం ఉండటంతో అందులో తాంబూలం లేదా వాయనం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

వరలక్ష్మీ వ్రతంలో తోరం అంటే ఏమిటి?

వరలక్ష్మీ వ్రతంలో తోరం కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. సంప్రదాయ ప్రకారం తొమ్మిది వరుసల దారంతో తోరాన్ని తయారు చేసి, అందులో తొమ్మిది ముళ్లు వేస్తారు. ప్రతి ముడి వేస్తున్నప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన తొమ్మిది నామాలను స్మరించే ఆచారం ఉంది:
‘కమలాయై నమః, రమాయై నమః, లోకమాత్రే నమః, విశ్వజనన్యై నమః, మహాలక్ష్మ్యై నమః, క్షీరాబ్ధి తనయాయై నమః, విశ్వసాక్షిణ్యై నమః, చంద్రసోదర్యై నమః, హరివల్లభాయై నమః.’
తొమ్మిది ముళ్లు పూర్తయిన తర్వాత “బధ్నామి దక్షిణే హస్తే…” అనే శ్లోకాన్ని స్మరిస్తూ కుడిచేతికి తోరం కట్టుకునే సంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో భార్య చేతికి భర్త తోరం కట్టడం ఆనవాయితీగా ఉంటుంది. తొమ్మిది సూత్రాలతో కూడిన ఈ తోరం తొమ్మిది రకాల శుభాలు, సంపదలు, వైభవాలకు ప్రతీకగా భావిస్తారు.

తోరాన్ని ఎప్పుడు విప్పాలి? ఎలా తొలగించాలి?

వరలక్ష్మీ వ్రతం మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసి, ఆమెను కదిలించిన తర్వాత తోరాన్ని తొలగించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో “గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ…” అనే శ్లోకాన్ని స్మరిస్తూ తోరంలోని ముళ్లను విప్పాలని చెబుతారు. తోరాన్ని కత్తెరతో కత్తిరించడం లేదా బలంగా తెంచడం కంటే.. ముళ్లను విప్పి తులసి కోటలో, ప్రవహించే నీటిలో లేదా ఎవరూ నడవని పవిత్రమైన ప్రదేశంలో ఉంచడం సంప్రదాయబద్ధమైన విధానంగా పేర్కొంటారు.

చివరిగా.. వరలక్ష్మీ వ్రతం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాకుండా.. కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం అమ్మవారిని భక్తితో ప్రార్థించే పవిత్రమైన ఆచారం. ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి పూజా విధానాలు, నైవేద్యాలు, వాయనం సమర్పించే పద్ధతుల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. అందువల్ల పై వివరాలను సంప్రదాయ విశ్వాసాలుగా పరిగణించి, మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆచారాలు లేదా పురోహితుల సూచనలకు అనుగుణంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకోవడం మంచిది. భక్తి, శ్రద్ధతో మహాలక్ష్మిని ఆరాధిస్తే అమ్మవారి కృప తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవచ్చు.

(Disclaimer: ఈ కథనంలోని వ్రత విధానం, ఆచారాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయాలను బట్టి మారవచ్చు. మీ కుటుంబ ఆచారం, స్థానిక పంచాంగం లేదా పండితుల సూచనలను అనుసరించండి.)

Loading...
Unable to load recommendations.
Follow Us