
Tulsi Shaligram Vivah Story Telugu: హిందూ సంప్రదాయంలో తులసి వివాహానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి రోజున తులసి మాతకు, శాలిగ్రామ స్వామికి వైభవంగా వివాహం జరిపిస్తారు. ఈ ఏడాది నవంబర్ 20, 2026న దేవుత్తాన ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) జరుపుకోనుండగా, మరుసటి రోజు నవంబర్ 21న తులసి వివాహ వేడుకను నిర్వహించనున్నారు. చాతుర్మాస కాలంలో నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు దేవుత్తాన ఏకాదశి రోజున మేల్కొంటారు. దీంతో శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుడతారు. అయితే విష్ణుమూర్తి నిద్రలేచిన మరుసటి రోజే తులసి వివాహం ఎందుకు చేస్తారు? తులసి మాత, శాలిగ్రామ స్వామి(విష్ణు) వివాహం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈ వేడుకను నిర్వహించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాల గురించి తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు చాతుర్మాసం కొనసాగుతుంది. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని సంప్రదాయంగా భావిస్తారు. కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొంటారు. దీనినే దేవుత్తాన లేదా దేవప్రబోధిని ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి మేల్కొన్న మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు తులసి మాతకు, శాలిగ్రామ స్వామికి వివాహం జరిపిస్తారు. ఈ వేడుకతో భూమిపై మళ్లీ వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అనుకూల సమయం ప్రారంభమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే తులసి వివాహాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం, పూర్వం వృంద అనే గొప్ప పతివ్రత ఉండేది. ఆమె జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది. వృందకు తన భర్తపై ఉన్న అపారమైన భక్తి, పాతివ్రత్య మహిమ కారణంగా జలంధరుడు అత్యంత శక్తివంతుడిగా మారాడు. దేవతలు సైతం అతడిని ఓడించలేకపోయారు. దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. లోకకల్యాణం కోసం విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లి, ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశారని పురాణ కథనం. దీంతో జలంధరుడి శక్తి తగ్గి, యుద్ధంలో మరణించాడు.
ఈ విషయం తెలుసుకున్న వృంద తీవ్ర ఆగ్రహంతో విష్ణుమూర్తిని శిలగా మారమని శపించింది. అనంతరం ఆమె తన ప్రాణాలను విడిచింది. వృంద త్యాగానికి గుర్తుగా ఆమె బూడిద నుంచి పవిత్రమైన తులసి మొక్క ఆవిర్భవించిందని చెబుతారు. వృంద కోరిక మేరకు శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకుంటానని వరమిచ్చారు. అప్పటి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి, శాలిగ్రామ వివాహం నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి.
తులసి వివాహం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇందులో కుటుంబ బంధాలు, దాంపత్య జీవితం, భక్తి, పవిత్రత వంటి ఎన్నో ఆధ్యాత్మిక భావాలు ఇమిడి ఉన్నాయి.
ఈ రోజున తులసి మొక్కను అందంగా అలంకరించి, చెరకు గడలతో పందిరి వేసి, పూలు, పసుపు, కుంకుమలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. అనంతరం శాలిగ్రామ స్వామితో తులసి మాతకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తారు. మంగళహారతులు ఇచ్చి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇలా తులసి వివాహాన్ని జరుపుకోవడం వల్ల ఆ శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
(Disclaimer: ఈ కథనం హిందూ పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. ఇందులో పేర్కొన్న ఆధ్యాత్మిక ఫలితాలు భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి. వీటిని నిర్ధారిత వాస్తవాలుగా భావించరాదు.)