తిరుమల కొండల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండలను జీరో కార్బన్ ఎమిషన్ జోన్‌గా మార్చే టార్గెట్‌తో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది.
కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను నడిపేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానించామని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రస్తుతానికి తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. RTC నుంచి తొలి ఎలక్ట్రికల్ బస్సులు తిరుమలకు రాబోతున్నాయన్నారు.
కేంద్రం నుంచి అనుమతులు రాగానే త్వరలో సర్వీసులు మొదలవుతాయని అన్నారు. సోమవారం తిరుమల బస్టాండులో ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అతిపెద్ద భవనం ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన తిరుపతిలో పర్యటించారు.