Ananthapur: శ్రీ గంప మల్లయ్య స్వామి వేడుకల్లో అపశృతి.. పూజ సమయంలో జారిపడి పూజారి మృతి

ప్రతీఏటా భక్తి పారవశ్యం మధ్య జరిగే పూజలు ఈసారి విషాదాన్ని నింపాయి. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండమీద అపశృతి చోటు చేసుకుంది.

Ananthapur: శ్రీ గంప మల్లయ్య స్వామి వేడుకల్లో అపశృతి.. పూజ సమయంలో జారిపడి పూజారి మృతి
Tragedy In Sri Gampa Mallya Swamy Celebrations

Edited By: Janardhan Veluru

Updated on: Aug 21, 2021 | 4:37 PM

Tragedy in Sri Gampa Mallya Swamy celebrations: ప్రతీఏటా భక్తి పారవశ్యం మధ్య జరిగే పూజలు ఈసారి విషాదాన్ని నింపాయి. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండమీద అపశృతి చోటు చేసుకుంది. పూజా సమయంలో పూజారి అప్పా పాపయ్య కాలు జారి లోయలో పడిపోయాడు. భారీ కొండ మీద నుంచి పడిపోవడంతో.. పూజారి పాపయ్య అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు.

శింగనమల మండలం పరిధిలో చాలా ఎత్తైన కొండ ప్రదేశంలో శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. కొండ ప్రాంతం పైకి అత్యంత సాహసోపేతంగా ఈ యాత్ర సాగుతుంది. అయితే, స్వామివారికి కొండపై హారతి ఇచ్చే కార్యక్రమం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. ఎత్తైన కొండ పై నూనె చారలు ఉన్న బండ పై నుంచి పూజారి పూనకం వచ్చిన విధంగా హారతి ఇస్తారు. దీనిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆ ప్రాంతమంతా గోవిందనామ స్మరణ మధ్య జరిగే ఈ కార్యక్రమం ఈసారి విషాదాన్ని నింపింది.

ఎప్పటిలానే పూజారి అప్పా పాపయ్య హారతి కార్యక్రమం ప్రారంభించారు. అయితే, అంతా ఉత్కంఠగా హారతి కార్యక్రమం చేస్తుండగా ఒక్కసారిగా పూజారి కాలు జారి కింద పడిపోయాడు. దాదాపు వందల మీటర్ల ఎత్తైన కొండపై నుంచి పూజారి కింద పడిపోయాడు. దీనిని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరుగు పరుగున కిందికి వెళ్లి చూడగా అప్పటికే పూజారి చనిపోయి ఉన్నాడు. ప్రతియేటా భక్తి పారవశ్యం మధ్య జరిగే ఈ కార్యక్రమం ఈసారి విషాదం నింపడం భక్తులని కన్నీటి పర్యంతం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడే ఉన్న భక్తులు తమ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డీమార్ట్‌ పేరిట ఉచిత బహుమతులు అంటూ లింక్‌లు వస్తున్నాయా.? క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..