మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి.. నిజానికి జూన్‌లోనే ప్రార్థనా స్థలాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు.. ఇప్పుడు కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో ప్రభుత్వం కొన్ని షరతులతో ప్రార్థనాస్థలాలను తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది.. సుప్రసిద్ధ షిర్డీ సాయిబాబా దేవస్థానం తెరచుకోవడంతో భక్తులు ఆ క్షేత్ర దర్శనం కోసం ఉత్సాహం చూపుతున్నారు.. ఆలయాలలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్కులను కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే షిర్డీ సాయిబాబా ఆలయంలో రోజూ ఆరు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. కౌంటర్లతో పాటు, ఆన్‌లైన్ టికెట్లు జారీ చేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. అలాగే 65 ఏళ్లు దాటినవారికి, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని చెప్పింది. అలాగే ముంబాయిలోని సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్ హల్వాయి గణపతి ఆలయం కూడా భక్తుల కోసం తెరచుకున్నాయి.. కరోనా కారణంగా మార్చి నుంచి ఆలయాలు మూతబడ్డాయి.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు.. అయితే ఆలయాల్లో నిత్యపూజలు మాత్రం యథావిధిగా జరిగాయి..