Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది భద్రాద్రి(Bhadradri). రాములోరి కల్యాణ వేడుకతో పులకించిపోతోంది. భక్తుల జయజయద్వానాల మధ్య మిథిలా మండపం(Mithila Stadium)లో జగదభిరాముని కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల వివాహ మహోత్సవం ఆద్యంతం.. రెప్పవాల్చకుండా వీక్షించి తరించింది భక్త కోటి. పునర్వసు నక్షత్రం..అభిజిత్ లగ్నంలో జానకిరాముల కల్యాణ క్రతువు కమనీయంగా జరిగింది. పెండ్లి కూతురిగా ముస్తాబైన సీతమ్మ తల్లి మెడలో..రాములోరు మంగళసూత్రధారణ చేశారు. ఆ దివ్య క్షణాలను కనులారా వీక్షించి తన్మయత్వంలో మునిగిపోయారు భక్తులు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతివ్వడంతో భద్రాద్రి భక్తజనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది.
ఏటా శ్రీరాముని జన్మదినాన రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలో అందంగా ముస్తాబు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆసీనులను చేశారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అపురూప ఘట్టాన్ని జరిపించారు. వేదికపై పెండ్లికుమారునిగా రాముడు, పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చిన శ్రీ సీతారాముల తేజోరూపాన్ని దర్శించుకొని తన్మయత్వంలో మునిగిపోయారు భక్తులు.
ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు..తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అందజేశారు.
భక్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో భద్రగిరి మారుమోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాచలం వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు పంపిణీ చేసేందుకు 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇక రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా నిర్వహించినట్టు ఈ సారి కూడా ఈ తంతును ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read: Andhra Pradesh: సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో పేర్లు ఖరారు.. పెద్దిరెడ్డి, బొత్సకు మళ్లీ ఛాన్స్!