
మన సనాతన ధర్మంలో దేవాలయాలు కొండలపై వెలవడం అనేది ఒక సాధారణ దృశ్యం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి, సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి.. ఇంకా శబరిమల, యాదాద్రి ఆలయాలు కొండల పైననే ఉన్నాయి. ఇవి మాత్రమే ఇంకా ఎన్నో ఆలయాలు కొండలపైనే ఉంటాయి. అనేక భక్తి, ఆధ్యాత్మిక కేంద్రాలు కొండల మీద ఉండటం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. దీనికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.
జంక్షన్లలో, మైదాన ప్రాంతాల్లో లేదా తోటల మధ్య కాకుండా కొండలపైనే దైవం ఎందుకు కొలువై ఉంటుంది? సాధారణంగా కొండ ఎక్కడం ఒక శ్రమతో కూడిన పని. పర్వతారోహకులు పైకి ఎక్కుతున్న కొలది ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం, శరీరంపై బరువులు తగ్గించుకోవడం అవసరమని గమనిస్తారు. అధిక బరువులతో పర్వతారోహణ చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఈ భౌతిక ప్రయాణానికి ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంది. దేవుణ్ణి చేరుకోవాలంటే, భక్తులు తమ భౌతిక బరువులను, అనవసరమైన బాధ్యతలను, లోకసంబంధమైన ఆకర్షణలను తగ్గించుకోవాలి అనేదే ఆ సందేశం. ఈ కొండ దేవాలయాల సందర్శన భక్తులకు భౌతికంగా, మానసికంగా ఒక సవాలును అందిస్తుంది. ఇది స్వచ్ఛమైన భక్తి, త్యాగం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీక. భగవంతుని సన్నిధిని పొందడానికి మనిషి తనలోని అహంకారాన్ని, మోహాన్ని వదిలివేయాలనే సూత్రాన్ని ఈ కొండ ఆలయాలు గుర్తుచేస్తాయి. సనాతన ధర్మం బోధించే ఆధ్యాత్మిక మార్గంలో, తేలికైన మనసుతో, నిర్మలమైన హృదయంతో దైవాన్ని చేరవచ్చని ఇది బోధిస్తుంది.
అంతేకాదు.. కొండలపై గాలి స్వచ్ఛంగా ఉంటుంది, భూమి చుంబకశక్తి ఎక్కువగా పనిచేస్తుంది. అలాంటి ప్రదేశాల్లో ధ్యానం, ప్రార్థనకు అనుకూలమైన శక్తివంతమైన వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెబుతుంటారు. ఇక పూర్వికులు మరో కారణం కూడా చెబుతుంటారు. పూర్వకాలంలో గ్రామాలు, రాజ్యాల మధ్య నిత్యం కలహాలు జరుగుతూ ఉండేవి. కొండలపై టెంపుల్స్ ఉండటం వల్ల అవి సురక్షితంగా ఉండేవి. అలాగే జనసంచారం తక్కువగా ఉండటంతో నిశ్శబ్దం, ప్రశాంతత దొరికేది.