
వందే గురుపరంపరామ్. స్వీయ ఆరాధాన- సర్వ ఆదరణ. విశ్వ ఆధ్మాత్మిక స్పూర్తి కేంద్రం ముచ్చింతల్‌లో మరో జాతర. సాకేత రామయ్య సన్నిధిలో సకల జనుల మహోత్సవానికి వేళాయింది. మంగళప్రదంగా సమతా కుంభ్ -2024 సమారంభం మొదలైంది.

సమతా స్ఫూర్తి కేంద్రంలో శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల సంరంభం సాగుతోంది. శ్రీరామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆర్ధ్రా. ఆయన నక్షత్రం రోజునే ఈ ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది.

భీష్మ ఏకాదశి సందర్భంగా విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతోంది. మంగళవారం రోజు ఉదయం ఆర్ద్రాభిషేకం జరిగింది. సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారంభ స్నపనం వైభవంగా నిర్వహించారు.

ఆర్ద్ర అనేది భగవద్రామానుజులవారి అవతార నక్షత్రం. ఈ క్షేత్రానికి అధిష్ఠాన దేవుడిగా ఉండే శ్రీరామచంద్రప్రభు దివ్యసాకేత క్షేత్రంలో చిత్తా నక్షత్రం రోజు అవతరించారు. అయితే అయోధ్యలో ఉండే రాముడు మాత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించారు.

ఆర్ద్ర నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా తొలిరోజు తిరునక్షత్ర ప్రయుక్త తిరుమంజనంతో శుభారంభం జరుగుతుందని త్రిదండి చినజీయర్ స్వామివారు అన్నారు. స్వామి సన్నిధానంలో తిరుమంజనాన్ని అంతరంగికంగా నిర్వహించారు.

స్వామికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామ అర్చన జరిపించారు త్రిదండి చినజీయర్ స్వామి. స్వామివారి ఆజ్ఞని స్వీకరించి కార్యక్రమాలు ఆరంభం చేయడానికి యోగ్యతను ప్రసాదించమని వేడుకున్నారు. అష్టోత్తరం, హారతి పూర్తికాగానే అనుజ్ఞ ప్రార్థనను జరిపించారు.

చరితకు, భవితకు వారధిగా శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు యావత్ జగతి దాసోహం.

ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల్లో వార్షికోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని తరించాలని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్వాహకులు సూచించారు.