
హిందూ ధర్మంలో ఫాల్గుణ మాసానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఫిబ్రవరి 18వ తేదీ, బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో ఎలాంటి దానాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయో, ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయో ఈ ప్రవచనం వివరిస్తుంది. పౌరాణిక గ్రంథాలు ఫాల్గుణ మాసాన్ని “సర్వ దేవతా సమారాధనల మాసం”గా అభివర్ణిస్తాయి. సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఇది చివరి నెల. మిగిలిన అన్ని మాసాలలో చేసిన పూజల ఫలితాలను ఈ ఫాల్గుణ మాసంలో పొందవచ్చు. మత్స్య పురాణం ప్రకారం, ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గోదానం చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రత్యక్షంగా గోవును శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి దానం చేయడం అత్యంత శుభకరం. ముఖ్యంగా విష్ణు ఆలయానికి గోదానం చేస్తే వేల రెట్ల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యక్ష గోదానం చేయలేనివారు ఫాల్గుణ మాసంలో వెండి, రాగి, లేదా పంచలోహాలతో చేసిన ఆవు బొమ్మను విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు. దీనివల్ల కూడా సర్వ సంపదలు చేకూరి, సమస్త దోషాలు తొలగిపోతాయి.
విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయో వ్రతాన్ని ఫాల్గుణ మాసంలో మొదటి పన్నెండు రోజులు ఆచరించాలి. ఫిబ్రవరి 18వ తేదీ, బుధవారం నుంచి ప్రారంభించి, వరుసగా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని పూజించి, ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పయో వ్రతం ద్వారా సంవత్సరం పొడవునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు “పుత్ర గణపతి వ్రతం” ఆచరించి గణపతిని పూజిస్తే, పుత్ర సంతానం కావాలనుకునే వారికి అబ్బాయి పుట్టే యోగం కలుగుతుంది. శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి రోజు పార్వతీదేవిని పూజిస్తే వివాహ, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
ఫాల్గుణ శుక్ల ఏకాదశిని “అమలక ఏకాదశి” అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజున ఉసిరిక చెట్టు వద్ద దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయడం, దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ రోజున దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించడం ద్వారా జీవితంలో అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అయ్యప్ప స్వామి జన్మించిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమి కాబట్టి, ఈ రోజున అయ్యప్ప జన్మదినం కాబట్టి ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించడం ద్వారా హరిహరాత్మకుడైన అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజు శివారాధన, ఈశ్వరుడిని తుమ్మిపూలతో పూజించడం, శివ సంబంధమైన స్తోత్రాలు పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మనం జరుపుకునే హోలీ పండుగ కూడా ఇదే పర్వదినం.
ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని “సీతాష్టమి” అంటారు. సీతాదేవి జనక మహారాజుకు లభించిన రోజు ఇది. ఆ రోజు సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య విభేదాలు తొలగిపోతాయి. ఫాల్గుణ మాస అమావాస్యను “కొత్త అమావాస్య” అంటారు. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున ఏ దానం ఇచ్చినా సంవత్సరం పాటు గ్రహ దోషాలు తొలగిపోయి ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి.
పౌరాణిక గ్రంథాలు తెలిపిన ప్రకారం, ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనెలను కలిపి గానీ, విడివిడిగా గానీ శివుడికి అభిషేకం చేస్తే, ఈ మాసం పూర్తయిన 90 రోజుల్లోనే సర్వ సంపదలు చేకూరుతాయి. అంతటి శక్తివంతమైన ఫాల్గుణ మాసంలో ఈ విధి విధానాలను పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)