
శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులకు సప్త శనివారాల వ్రతం ఒక ప్రసిద్ధ మార్గం. ఈ వ్రతాన్ని స్త్రీలు అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబానికి శుభం కలగాలని ఆశించే వారు ఈ వ్రత నియమాలను తెలుసుకోవడం ముఖ్యం.
ఏదైనా శనివారంనాడు ప్రారంభించే ఈ వ్రతాన్ని.. శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ప్రారంభించడం ఉత్తమం. వరుసగా ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని నిర్వర్తించాలి. ఇంట్లో నెలసరి వంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ వారం వ్రతాన్ని ఆపి, తర్వాతి శనివారం నుంచి కొనసాగించవచ్చు. వైశాఖ, శ్రావణ, మార్గశిర, కార్తీక మాసాలు వ్రత ప్రారంభానికి అనుకూలమైనవి. ఆషాఢ, భాద్రపద మాసాలు, గ్రహణ సమయాలలో ప్రారంభించకూడదు.
వ్రతం చేసేవారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేసి, ఉదయం 6 నుంచి 8 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. రెండు పూటలా దీపారాధన చేయాలి. ఉదయం పూజకు ముదురు నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు, సాయంత్రం పూజకు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఉదయం నువ్వులతో చేసిన ఏడు చిమ్మిరి లడ్డూలు, సాయంత్రం శనగపిండితో చేసిన ఏడు లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు అందుబాటులో ఉన్న పండ్లు కూడా నివేదించవచ్చు. ప్రతి శనివారం ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసి పసుపునీళ్లు చల్లి అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి చిత్రపటాలు ఉంటే మంచిది. పూజ గది ఈశాన్యంలో చెక్క పీఠంపై ఎర్రటి వస్త్రం పరచి స్వామివారి ఫోటోను ఉంచాలి. పసుపు గణపతిని పూజించి వ్రతాన్ని ప్రారంభించాలి.
ఈ వ్రతంలో ముడుపు కట్టడం, పిండి దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. మొదటి శనివారం నాడు పసుపు రంగు కాటన్ వస్త్రంలో పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, అక్షింతలు, గుప్పెడు బియ్యం, చిన్న బెల్లం ముక్క, రెండు తులసి దళాలు, దక్షిణ ఉంచి, మనసులోని కోరికలను స్వామి వారికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపును ఏడు శనివారాలు స్వామి వారి ముందు ఉంచాలి. బియ్యపు పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవుపాలు కలిపి ఏడు పిండి ప్రమిదలు తయారు చేసి, పసుపు, కుంకుమలతో గోవింద నామాలు పెట్టుకోవాలి. తమలపాకులపై ఈ ప్రమిదలను ఉంచి, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి, ఒక్కో దీపంలో ఏడు వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాలను గోమాతకు తినిపించడం లేదా ప్రవహించే నదిలో వేయడం పుణ్యఫలితాన్నిస్తుంది.
వ్రత నియమాలు, పారాయణాలు:
వ్రతం చేసే ఆడవారు గోవింద నామం తిలకాన్ని నుదుటిపై ధరించాలి. ప్రతి శుక్రవారం, శనివారం బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన నిద్రించడం, పగటిపూట నిద్రపోకుండా ఉండటం మంచిది. మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవింద నామాలు, అష్టోత్తర శతనామావళి వంటివి జపించడం శ్రేష్ఠం. ఇవి జపించలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని జపించవచ్చు. పూజలో దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు, దక్షిణ ముఖంగా పెట్టకూడదు.
వ్రత సమాప్తి, ఇతర ఆచారాలు:
వ్రతం చివరలో పచ్చ కర్పూరంతో మంగళహారతి సమర్పించి, కొబ్బరికాయ కొట్టి, సప్త శనివారాల వ్రత కథను చదివి, అక్షింతలు వేసుకొని ప్రదక్షిణాలు చేయాలి. ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ముడుపుతో తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలి. తిరుమల వెళ్లలేని వారు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ముడుపును వడ్డీతో సహా హుండీలో వేయాలి. దర్శనం పూర్తయ్యాక స్వామికి మూడు కత్తెర్లు సమర్పించడం శుభప్రదం. ప్రతి శనివారం సాయంత్రం ఒక అతిథిని ఆహ్వానించి, అరటి ఆకుపై ప్రసాదంతో పాటు భోజనం వడ్డించాలి. ఆఖరి శనివారం ఏడుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం అందించాలి. భార్యాభర్తలు కలిసి లేదా ఎవరో ఒకరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంటి గడపలకు పసుపు, కుంకుమ, మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరణ చేయాలి. పూజ సమయంలో మౌనంగా ఉండి, నైవేద్యం, హారతి సమర్పించేటప్పుడు మాత్రమే గంట మ్రోగించాలి. ప్రసాదాన్ని అందరికీ పంచడం ద్వారా పుణ్యఫలితం రెట్టింపు అవుతుంది. వ్రతంలో పొరపాట్లు జరిగితే క్షమాపణ వేడుకుని, పసుపునీళ్లు చల్లుకొని కొనసాగించాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. కోరిక వెంటనే నెరవేరకపోయినా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం ముఖ్యం. సరైన సమయంలో సరైన ఫలితం దక్కుతుంది.