
జాతకంలో గ్రహాలు సంచారం చేసినప్పుడు శుభాశుభ సమ్మేళనమైన ఫలితాలను ఇస్తాయి. ఈ మర్త్య లోకంలో కేవలం శుభములు లేదా కేవలం అశుభములు మాత్రమే ఉండవు. శుభాశుభాల సమ్మేళనంగానే జీవితం సాగుతుంది. అయితే, రాగల అశుభ పరిణామాలను, ఉపద్రవాలను, భయంకరమైన గ్రహదోషాలను అధిగమించడానికి ఒక సాధనం ఉన్నదని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కొటేశ్వరరావు వివరించారు. ధూర్జటి మహాకవి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో “గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునీ దహనం గప్పక జాలునే శలభసంతానంబు నీ సేవచేతి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా” అని ప్రస్తావించారు. అంటే, భగవంతుని కల్యాణనామాన్ని ప్రతిరోజూ స్మరించే ఉత్తములను గ్రహాలు బాధించలేవు. భగవంతుని నామ సంకీర్తనం అలవాటు చేసుకున్నవారిని గ్రహములు కూడా బాధించవు. ప్రతిరోజూ భగవన్నామం తెలిసి కానీ, తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం.
అయితే, కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుందని ఎంత సారం ఉన్నదో, దాని కొనసాగింపు కూడా అంతే సారవంతమైనది. భగవంతుని నామములు కేవలం సాధారణ పేర్లు కావు. ఒక్కొక్క నామం చెప్పగా చెప్పగా, ఆ నామం అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చేయడానికి ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు, ఆయా సమయాలలో ఆయన చూపించిన దయ, కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు లోకం ఆయన్ని కీర్తించిన పేర్లే అవి.
ఈ విధంగా నామాల అర్థాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడితో ఒక అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం ఏర్పడితే, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది. ఆయన చెప్పినట్లు ధర్మాన్ని పాటిస్తే, మనము ప్రశాంతంగా ఉంటాము, లోకము కూడా ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి, సమాజము శాంతిభద్రతలన్నీ ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి. అటువంటి ధర్మాచరణము చేయడానికి మొట్టమొదట భగవన్నామమును పలకడంలోనే సమన్వయం కలుగుతుంది.
పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఒకవేళ గ్రహగతులు అంతగా అనుకూలంగా లేకపోతే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఏ బెంగా పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకొని ధర్మమార్గంలో ప్రయాణం చేసేవాడు, చేతికి నూనె రాసుకుని పనస తొనలు తీసిన వాడితో సమానం. పనస తొనలు ఎంత జిగురుగా ఉన్నా, చేతికి నూనె రాసుకున్నవారికి ఆ జిగురు అంటుకోదు. అలాగే ధర్మమార్గంలో ప్రవర్తించినవాడికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. భగవదనుగ్రహం ఎవరికి ఉంటుందో, అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధపెట్టవు అని చాగంటి కొటేశ్వరరావు స్పష్టం చేశారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)