Medaram Sammakka Saralamma Mahajathara: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం నిర్ణయించింది. 2022లో జరగనున్న మహాజాతర తేదీలను ప్రకటించారు.
తెలంగాణ సుప్రసిద్ధ జాతర, గిరిజన ప్రజల ఆరాధ్య దేవతలు కొలువుదీరిన మేడారంలో మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. దీనికి కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జాతర జరగనుండడంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పూజారుల (వడ్డెల) సమావేశం నిర్వహించి, 2022లో జరగనున్న మహాజాతర తేదీలను నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి రావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం తరఫున మాస్కులను భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక అర గంటలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విడత దేశ, విదేశీ భక్తులు ఎక్కువ మంది రావచ్చని మంత్రి రాథోడ్ పేర్కొన్నారు. 8 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ రద్దీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
రెండేళ్లకోసారి జాతర జరుగుతుంటుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు. ఫిబ్రవరి 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
Read Also… Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..