యాదాద్రిలో ఉన్న బాలాలయం(Yadagirigutta Balalayam) మూతపడింది. 70 నెలలుగా భక్తులకు సేవలందించిన పవిత్ర స్థలం.. ఇక అది ఒక చారిత్రక స్థలంగా మారనుంది. ఇంతకు ఆ ఆలయాన్ని ఏం చేయబోతున్నారు? 70 నెలలుగా లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన యాదగిరిగుట్ట బాలాలయానికి ఇక సెలవు పలికారు. పంచకుండాత్మక యాగం పూర్తి అవుతూనే యాదాద్రి కొత్త దేవాలయంలోకి స్వామి వారి ఉత్సవ, పూజా మూర్తులు వేంచేశారు. ఇవాళ సాయంత్రం నుంచి ప్రధాన ఆలయంలో భక్తులకు స్వయంభు దర్శనాలు కలగనుంది. ఆరేళ్ల కిందట బాలాలయంలో మూల విరాట్టు రూపానికి ప్రాణప్రతిష్ట చేసి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్టించారు. ఉత్సవ మూర్తులను కూడా ప్రతిష్టించి యథాప్రకారం నిత్య కైంకర్యాలు నిర్వహించారు.
దేవాలయానికి దిగువన ప్రధాన ఆలయ గర్భాలయాన్ని తలపించే రీతిలో తాత్కాలిక పద్ధతిలో దీన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్ 21న బాలాలయంలో స్వామివారికి ప్రాణప్రతిష్ట చేశారు. అప్పట్నుంచీ ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు బాలాలయమే యాదగిరీశుడి నిలయంగా మారి భక్తులకు దర్శనభాగ్యం కల్పించింది. ఆరేళ్ల పాటు యాదగిరి నిలయంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన బాల ఆలయానికి అధికారులు సెలవు పలికారు.
ఆరేళ్లుగా ఎదరు చూస్తున్న యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం మరి కొన్ని గంటల్లో భక్తులకు కలుగనుంది. ఇంత కాలం స్వామి వారి దర్శన భాగ్యం కలిగిన బాలాలయం మూత పడుతోంది. ఇక దివ్వధామంగా రూపుదిద్దుకున్న ఈ శిల్పకళా ఆలయంలో కొలువు దీరిన నరసింహుని తొలిభక్తునిగా రేపు కేసీఆర్ రానున్నారు.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..