AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట!

Tulasi Plant Vastu Tips: తులసి మొక్క ఎండిపోతే చాలామంది చెత్తలో పడేస్తారు. కానీ హిందూ సంప్రదాయాల ప్రకారం ఎండిన తులసి కూడా పవిత్రమైనదే. దానిని ఎలా వినియోగించాలి? ఏ పరిహారాలు పాటించాలి? వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం.

Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట!
Tulasi Plant Vastu Tips
Rajashekher G
|

Updated on: Jun 08, 2026 | 11:05 PM

Share

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసి దేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని విశ్వసిస్తారు. అందుకే తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా గౌరవంతో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి. తులసి మొక్క ఎండిపోతే దానిని నిర్లక్ష్యంగా చెత్తలో వేయకుండా, కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా పవిత్రతను కాపాడుకోవచ్చని విశ్వాసం.

ఎండిన తులసిని చెత్తలో వేయకండి

తులసి ఆకులు లేదా కొమ్మలు ఎండిపోయాయని వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం మంచిది కాదని మత విశ్వాసాలు చెబుతున్నాయి. తులసి ఎండిపోయిన తర్వాత కూడా పవిత్రతను కలిగి ఉంటుందని భావిస్తారు. వాటిని చెత్తలో వేయడం కంటే సమీపంలోని పవిత్ర జలాశయంలో లేదా నదిలో నిమజ్జనం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.

తులసి కర్రతో దండ తయారు చేసుకోవచ్చు

ఎండిన తులసి కాండాన్ని శుభ్రపరచి, గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత తులసి దండగా తయారు చేసి ధరించవచ్చు. వైష్ణవ సంప్రదాయంలో తులసి దండకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని నమ్మకం. అయితే తులసి దండ ధరించే వారు సత్యవచనం, పరిశుభ్రత వంటి నియమాలను పాటించాలని చెబుతారు.

ఇవి కూడా చదవండి

పూజా గదిలో భద్రపరచండి

ఎండిన తులసి ఆకులు లేదా చిన్న కొమ్మలను ఎర్రటి వస్త్రంలో కట్టి పూజా మందిరంలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం.

ప్రధాన ద్వారం వద్ద ఉంచడం

వాస్తు విశ్వాసాల ప్రకారం, ఎండిన తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని చెబుతారు. ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుందని భావిస్తారు.

హోమాలు, యజ్ఞాల్లో వినియోగించండి

ఎండిన తులసి ఆకులను హవనం, యజ్ఞం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సమర్పించవచ్చు. తులసి సమర్పణ వల్ల వాతావరణం పవిత్రమవుతుందని, దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

తులసి వత్తితో దీపారాధన

ఎండిన తులసి ఆకులు, చిన్న కొమ్మలతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం కూడా ఒక సంప్రదాయం. ఈ దీపారాధన వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. అలాగే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయని చెబుతారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us