కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి అద్భుత లీల వెనుక కథ ఇదే!

Damodara Masam-Kartik Month Significance: కార్తిక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు పిలుస్తారు? తల్లి యశోద ప్రేమకు శ్రీకృష్ణుడు బంధీ అయిన అద్భుత లీల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, నలకూబరుడు–మణిగ్రీవుల శాపవిముక్తి కథ, దామోదర వ్రతం విశిష్టత గురించి తెలుసుకుందాం.

కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి అద్భుత లీల వెనుక కథ ఇదే!
Damodara Masam Kartik Month Significance

Updated on: Nov 25, 2026 | 9:33 PM

Damodara Masam-Kartik Month Significance: కార్తీక మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసాన్ని కేవలం కార్తీక మాసంగానే కాకుండా ‘దామోదర మాసం’ అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి దామోదరుడు అనే పేరు రావడం వెనుక ఓ అద్భుతమైన బాల్యలీల ఉంది. తల్లి యశోద ప్రేమకు పరమాత్ముడే బంధీ అయిన ఈ లీల భక్తి, ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. అందుకే కార్తీక మాసంలో దామోదర లీలను చదవడం, వినడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. మరి శ్రీకృష్ణుడికి దామోదరుడు అనే పేరు ఎలా వచ్చింది? ఆ లీల వెనుక ఉన్న విశేషాలేమిటో తెలుసుకుందాం.

దామోదరుడు అంటే ఏమిటి?

‘దామ’ అంటే తాడు, ‘ఉదరం’ అంటే పొట్ట. అంటే తాడుతో పొట్టకు బంధించబడినవాడు అని దామోదరుడు అనే పదానికి అర్థం. శ్రీకృష్ణుడి బాల్యంలో తల్లి యశోద ఆయనను తాడుతో రోటికి కట్టేసిన సంఘటన కారణంగా ఈ పేరు వచ్చింది. మరో అర్థం ప్రకారం సమస్త లోకాలను తన ఉదరంలో ధరించినవాడు కూడా దామోదరుడే.

యశోదమ్మకు చిక్కిన చిన్ని కృష్ణుడు

గోకులంలో బాలకృష్ణుడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. గోపికల ఇళ్లలో వెన్న దొంగిలించి తినడం, కుండలు పగలగొట్టడం, తోటి పిల్లలకు, కోతులకు వెన్న పంచడం వంటివి చేసేవాడు. ఒకరోజు యశోదమ్మ ఇంట్లో పాలు కాస్తుండగా కృష్ణుడు ఆకలితో మారాం చేశాడు. దీంతో ఆమె కన్నయ్యకు పాలు ఇస్తుండగా పొయ్యిమీద పాలు పొంగడంతో మధ్యలోనే లేచి వెళ్లింది. దీంతో కోపగించిన కృష్ణుడు వెన్న కుండను పగలగొట్టి వెన్న తినసాగాడు. తిరిగి వచ్చిన యశోదమ్మ ఇది చూసి కన్నయ్యను పట్టుకుని తాడుతో రోటికి కట్టాలని ప్రయత్నించింది. అయితే ఎన్ని తాళ్లు కలిపినా ప్రతిసారీ రెండు అంగుళాలు తక్కువయ్యేవి. చివరకు తల్లి పడుతున్న శ్రమను చూసిన కృష్ణుడు ఆమె ప్రేమకు కరిగిపోయి బంధనానికి అంగీకరించాడు. అలా యశోదమ్మ తన బిడ్డను రోటికి కట్టేసింది.

ఇవి కూడా చదవండి

నలకూబరుడు, మణిగ్రీవులకు శాపవిముక్తి

రోటికి కట్టబడి ఉన్న కృష్ణుడు దానిని లాక్కుంటూ రెండు పెద్ద మద్ది చెట్ల మధ్య నుంచి వెళ్లాడు. దీంతో ఆ చెట్లు నేలకూలి, వాటి నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వారే కుబేరుడి కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుడు. ఒకప్పుడు సంపద, ఐశ్వర్యంతో అహంకరించిన వీరు నారద మహర్షి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో ఆయన శాపానికి గురయ్యారు. భూమిపై మద్ది చెట్లుగా జన్మించారు. శ్రీకృష్ణుడి స్పర్శతోనే శాపవిముక్తి లభిస్తుందని నారదుడు వరమిచ్చాడు. ఆ విధంగా కృష్ణుడి అనుగ్రహంతో వారు తిరిగి దివ్యరూపాలను పొంది దేవలోకానికి చేరుకున్నారు.

దామోదర లీలలోని అంతరార్థం

సర్వలోకాలను పాలించే పరమాత్ముడు సైతం స్వచ్ఛమైన తల్లి ప్రేమకు లొంగిపోయాడనేది ఈ లీలలోని ప్రధాన సందేశం. భగవంతుడిని బలంతో కాకుండా నిర్మలమైన భక్తితో, ప్రేమతో మాత్రమే చేరుకోగలమని ఈ సంఘటన తెలియజేస్తుంది.

కార్తీక మాసంలో దామోదర వ్రతం

కార్తీక మాసంలో శ్రీకృష్ణుడిని దామోదర రూపంలో పూజించడం విశేష ఫలప్రదమని భక్తుల నమ్మకం. నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేసి, దామోదరాష్టకాన్ని పఠిస్తారు. అలాగే దామోదర లీలను చదవడం, వినడం, స్మరించుకోవడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే ఈ పవిత్ర మాసంలో దామోదరుడిని స్మరించి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలని భక్తులు కోరుకుంటారు.

(Disclaimer: ఈ కథనం హిందూ పురాణాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న పుణ్యఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మతపరమైన నమ్మకాలకు సంబంధించినవి.)

Loading...
Unable to load recommendations.
Follow Us