సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానం.. చీపురు విషయంలో ఈ తప్పులు చేస్తే అంతా దరిద్రమే..
చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. చీపురును ఎక్కడ ఉంచాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు పారవేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం, శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. చీపురుకు సంబంధించిన ముఖ్యమైన వాస్తు సూచనలు, జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.

ఇంట్లో ప్రతి వస్తువుకూ ఒక స్థానం, ప్రాముఖ్యత ఉంటుందని మన పురాణాలు, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. అందులో చీపురుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఇంటిని శుభ్రం చేయడానికి వాడే వస్తువు మాత్రమే కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురును వాడేటప్పుడు, ఉంచే ప్రదేశం, పారవేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే, అది ఆర్థిక నష్టాలకు, దురదృష్టానికి దారితీస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు, పండితులు పేర్కొంటున్నారు. ఈ పవిత్రమైన వస్తువు విషయంలో మనం చేయకూడని తప్పులను, నియమాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
చీపురు కొనుగోలు నియమాలు:
చీపురును కొనుగోలు చేయడానికి కొన్ని శుభ సమయాలు ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి, ఆ రోజున చీపురును కొనడం శ్రేష్ఠమని చెబుతారు. అయితే, పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, లేదా మంగళవారం వంటి రోజుల్లో చీపురు కొనడం అశుభంగా భావిస్తారు. ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం.
చీపురు పట్ల గౌరవం:
లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు, అలాగే దానిని దాటకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని విశ్వాసం. చీపురు పట్ల అగౌరవం చూపడం అంటే సంపదను నిర్లక్ష్యం చేయడమేనని పెద్దలు చెబుతారు.
చీపురు ఉంచే ప్రదేశం – విధానం:
చీపురును నిటారుగా నిలబెట్టడం మంచిది కాదు. గోడకు ఆనించి నిలబెట్టడం కూడా శుభకరం కాదు. వాస్తు ప్రకారం, నిటారుగా ఉంచిన చీపురు ఇంట్లో డబ్బు నిలబడకుండా చేస్తుందని నమ్మకం. చీపురును వాడిన తర్వాత దానిని అడ్డంగా, ఎవరి కంటా పడకుండా ఉంచాలి. ముఖ్యంగా తలుపుల వెనుక, లేదా ఇంటిలోని ఏదైనా మూల ప్రదేశంలో కనిపించకుండా పడుకోబెట్టాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని భావిస్తారు. చీపురును ధనం, ఆభరణాలు ఉండే ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు.
వంటగదిలో చీపురు నిషిద్ధం:
వంటగదిలో మనం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాము.. అది అన్నపూర్ణ స్థానం. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో చీపురును ఉంచడం వల్ల ఆహార లోటు, అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కేవలం చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులనూ వంటగదిలో ఉంచకూడదు.
పాడైన చీపురు పారవేసే నియమాలు:
పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పారవేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, అలాగే ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును బయట పారవేయవద్దు. శనివారం మాత్రమే పాడైన చీపురును పారవేయడం శ్రేయస్కరం. ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో అశుభాలు దూరమై శుభాలు కలుగుతాయని నమ్మకం..
చీపురు విషయంలో ఇతర ముఖ్య నియమాలు:
- శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇంటిని ఊడ్చకూడదు.
- ఏ జంతువులనూ చీపురుతో కొట్టకూడదు.
- ఇంటి లోపల, బయట ఒకే చీపురును వాడకూడదు. వేర్వేరు చీపురులు ఉండాలి.
- పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది.
- సంధ్యా సమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభంగా భావిస్తారు.
- ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికకాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురును బయట పారవేయాలి..
ఈ సంప్రదాయ నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని విశ్వాసం. వీటిని పాటించే ముందు పెద్దలు, పండితులను అడిగి తెలుసుకున్న తర్వాతే పాటించడం ఉత్తమం..
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
