Jagannath Temple: తెరుచుకున్న జగన్నాథుడి తలపులు.. దేవదేవుడి దర్శనంతో పులకించిపోయిన భక్తజనం..!

ఎన్నాళ్లుగానో మూసిన తలుపులు తెరుచుకున్నాయి. భక్తుల హృదయాలు పులకరించాయి. దేవదేవుడి దర్శనానికి నాలుగు ద్వారాలు తెరిచారు. ఇన్నాళ్లు ఒక్క ద్వారం గుండానే పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భక్తులు..ఇప్పుడు నాలుగు దిక్కుల నుంచి జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చు. నలు దిక్కుల వ్యాపించిన నారాయణుడిని, నాలుగు ద్వారాల నుంచి వచ్చి భక్తితో నమస్కరించుకోవచ్చు.

Jagannath Temple: తెరుచుకున్న జగన్నాథుడి తలపులు..  దేవదేవుడి దర్శనంతో పులకించిపోయిన భక్తజనం..!
Puri's Jagannath Temple

Updated on: Jun 13, 2024 | 8:27 PM

ఎన్నాళ్లుగానో మూసిన తలుపులు తెరుచుకున్నాయి. భక్తుల హృదయాలు పులకరించాయి. దేవదేవుడి దర్శనానికి నాలుగు ద్వారాలు తెరిచారు. ఇన్నాళ్లు ఒక్క ద్వారం గుండానే పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భక్తులు..ఇప్పుడు నాలుగు దిక్కుల నుంచి జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చు. నలు దిక్కుల వ్యాపించిన నారాయణుడిని, నాలుగు ద్వారాల నుంచి వచ్చి భక్తితో నమస్కరించుకోవచ్చు.

ఒడిశాలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంది. ఇవాళ్టి నుంచి పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ సర్కార్‌, ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పూరీ జగన్నాథ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొవిడ్‌ టైమ్‌లో అప్పటి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, వీటిలో మూడింటిని మూసివేశారు. వాటిని అప్పటినుంచి తెరవలేదు. మూతపడ్డ ప్రవేశ ద్వారాలు.. ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎట్టకేలకు ఈ ద్వారాలను బీజేపీ సర్కార్‌ ఓపెన్‌ చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఆయన మంత్రి వర్గ సహచరులు పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఇక పూరీ జగన్నాథ ఆలయంలో అభివృద్ధి పనుల కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించనుంది ఒడిశా నయా సర్కార్‌.

పూరీలోని జగన్నాథుడి ఆలయానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు దిక్కున ఉండే ద్వారాన్ని… సింహ ద్వారం అంటారు. దీనికి రెండు వైపులా సింహాల విగ్రహాలు ఉంటాయి. ఆలయంలో ప్రవేశించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం కూడా ఇదే. ఇది గ్రాండ్‌ రోడ్డుకు ఎదురుగా ఉంటుంది. సింహాన్ని మోక్షానికి ప్రతీకగా చెబుతారు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించేవారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే ద్వారంలో కాశీ విశ్వనాథుడు, గౌడీయ నరసింహ, భాగ్య హనుమాన్‌ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడే కొలువు దీరి ఉంటాయి. ఇక పశ్చిమంలో ఉండే ద్వారాన్ని వ్యాఘ్ర ద్వారం అంటారు. వ్యాఘ్రం అంటే పెద్దపులి. ఈ ద్వారానికి రెండువైపులా పులుల ప్రతిమలు ఉంటాయి. పులిని ధర్మానికి ప్రతీకగా చెబుతారు.

ఇక ఉత్తర భాగంలో నుంచి ఆలయంలోకి ప్రవేశించే ద్వారాన్ని….హస్తి ద్వారం అంటారు. దీనికి ఇరువైపులా ఏనుగు విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇక ఆలయానికి దక్షిణ భాగంలో ఉండే ద్వారాన్ని, అశ్వ ద్వారం అంటారు. ఈ ద్వారానికి రెండువైపులా గుర్రాల ప్రతిమలు ఉంటాయి. గుర్రాలను కోరికలకు చిహ్నాలుగా చెబుతారు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించేవాళ్లు కోరికలను వీడాలని చెబుతారు. ఈ నాలుగు ద్వారాలు… ధర్మానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకలు అని పండితులు చెబుతుంటారు.

మరిన్ని ఆధ్యాత్మికంగా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…