వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీల ఆఫ్ ద రికార్డ్ వీడియోపై బాలశౌరి రియాక్షన్, లోకేశ్‌ పిచ్చి ట్వీట్లు మానుకోవాలని కామెంట్

|

Feb 05, 2021 | 11:59 PM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలను విమర్శిస్తూ తెలుగుదేశం నేత నారా లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. లోకేశ్ ట్వీట్లో పోస్టు చేసిన వీడియోలో..

వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీల ఆఫ్ ద రికార్డ్ వీడియోపై బాలశౌరి రియాక్షన్, లోకేశ్‌ పిచ్చి ట్వీట్లు మానుకోవాలని కామెంట్
Follow us on

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలను విమర్శిస్తూ తెలుగుదేశం నేత నారా లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. లోకేశ్ ట్వీట్లో పోస్టు చేసిన వీడియోలో తానెక్కడా తప్పు మాట్లాడలేదని తెలిపారు. అయినా సరే వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ అంశంపైనైనా ట్వీట్ చేసే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని లోకేశ్‌కు సూచించారు. తమ పార్టీ అధినేతను అడిగి మాట్లాడతానంటే తప్పేముందని ప్రశ్నించారు.

శుక్రవారం ఢిల్లీలో వైకాపా నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలశౌరి తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాట్లాడారు. మీడియా మైకుల ముందుకొచ్చే క్రమంలో తాము కూర్చున్న సీట్లు మారుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడనా?” అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ బాలశౌరిని అడిగారు. ఆ అంశంపై పార్టీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని, తీసుకున్న తర్వాత మాట్లాడవచ్చని బాలశౌరి వారించారు. అయితే ఈ మీడియా సమావేశం అప్పటికే లైవ్ టెలీకాస్ట్ జరుగుతున్నందున, ఈ మాటలు అస్పష్టంగా కెమేరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో క్లిప్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తూ వైసీపీ ఎంపీల తీరును నారా లోకేశ్ తప్పుబట్టారు. దీనిపై వివరణ ఇచ్చే క్రమంలో ఎంపీ బాలశౌరి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, అలాంటప్పుడు ముందే ఎలా స్పందిస్తామని అన్నారు. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారం ఈనాటిది కాదని, అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడే చర్చకొచ్చిందని గుర్తుచేశారు. టీడీపీ నేతలు అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 కో – ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేసి, అందులో పనిచేసే ఉద్యోగులను రోడ్లపాలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని బాలశౌరి విమర్శించారు. ప్రభుత్వ డెయిరీని చంపి తమ సొంత హెరిటేజ్ సంస్థను పెంచుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ మర్చిపోయి తెలుగుదేశం సోషల్ మీడియా అతిగా ప్రవర్తిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

వైసీపీ నేతల మీటింగ్ క్లిప్ నెట్టింట్లో షేర్ చేసిన లోకేష్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో అడ్డంగా దొరికిపోయారంటూ వ్యాఖ్య