ఎంపీగా పోటీ చేసేందుకు ఏపీ నాయకులు ఎందుకు ఇష్టపడటం లేదు?

విజయవాడ: ఏపీలో రాజకీయాల్లో వింత పరిస్థితి ఏర్పడింది. ప్రధాన పార్టీల నాయకులు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పార్టీ నాయకులకు ఇది తలనొప్పిగా మారింది. ఇప్పుడిది ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ నాయకులు ఎందుకు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదు? ఎమ్మెల్యే టిక్కెట్‌పైనే ఎందుకు మోజు పడుతున్నారనేది మలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఎంపీ టిక్కెట్ వద్దంటున్న నేతలను సముదాయించడం […]

ఎంపీగా పోటీ చేసేందుకు ఏపీ నాయకులు ఎందుకు ఇష్టపడటం లేదు?

Updated on: Mar 15, 2019 | 7:32 PM

విజయవాడ: ఏపీలో రాజకీయాల్లో వింత పరిస్థితి ఏర్పడింది. ప్రధాన పార్టీల నాయకులు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పార్టీ నాయకులకు ఇది తలనొప్పిగా మారింది. ఇప్పుడిది ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ నాయకులు ఎందుకు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదు? ఎమ్మెల్యే టిక్కెట్‌పైనే ఎందుకు మోజు పడుతున్నారనేది మలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఎంపీ టిక్కెట్ వద్దంటున్న నేతలను సముదాయించడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తలకు మించిన భారంగా తయారైంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావును నరసారావు పేట ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు కోరారు.

కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. నరసారావు పేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రాయపాటి సాంబశివరావు తొలుత ఇష్టపడలేదు. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు బలవంతంగా ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు మాగంటి మురళీ మోహన్ కూడా ఆసక్తి చూపలేదు. విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కోరితే ఆయన అస్సలు అంగీకరించలేదు. అనంతపురం జిల్లా హిందూపూర్ ఎంపీ అభ్యర్ధిగా నిమ్మల కిష్టప్పను ఒప్పించేందుకు చంద్రబాబు కష్టపడ్డారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆయన ఇష్టపడ్డారు. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి శిద్ధా రాఘవరావును ఒప్పించడం కూడా చంద్రబాబుకు చాలా కష్టమైంది.

ఇక వైసీపీలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కిల్లి కృపారాణి, ధర్మాన ప్రసాదరావు, కె. పార్ధసారధి వంటి వారు ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన వారిని ఎంపీ స్థానాలకు పోటీ చేయించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

స్థానికంగా ఉంటే చక్రం తిప్పొచ్చని, ఢిల్లీలో అయితే నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతామనే అభిప్రాయం నాయకుల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఎంపీలు పొడిచేదేమీ ఉండదని పలుమార్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు ఎంత గొడవ చేసినా అధికార పక్షం చేయాలనుకున్నదే జరుగుతుందని స్వయంగా ఉపరాష్ట్రపతి పరోక్షంగా రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

పలు అంశాలపై పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపడానికి తప్ప పెద్దగా ఉపయోగం ఏముందనే అభిప్రాయం కూడా పలువురు నాయకుల్లో ఉందనే చర్చలు నడుస్తున్నాయి. అదే లోకల్ నాయకుడిగా ఉంటే పరపతి ఉంటుంది, మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉంటుందనే వాదన ఉంది. ఇలా పలు అంశాలపరంగా చూస్తే ఎంపీ కన్నా ఎమ్మెల్యేగానే చాలా మంచిదనే అభిప్రాయంలో ఏపీ నాయకులు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది.