ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడింది. అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా మధు పదవి బాధ్యతలు చేపట్టారు.
అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి పదవులు భర్తీ జరగలేదు. దీంతో మాకో పదవి కావాలంటూ కొందరు నేతలు వినతి పత్రం ఇచ్చి వెళుతున్నారు. మరోవైపు చాలా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కాగా, షెడ్యూల్ ప్రకారం జగన్ అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ చేయాలని అనుకున్నారని సమాచారం. కానీ కొందరు నేతల సూచన మేరకు పదవుల భర్తీ ఆయన పక్కన బెట్టేశారని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగబోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.