
ఏపీలో జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని.. ఆ పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని సోషల్ మీడియాలో వైసీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని ఛానళ్లు కూడా జనసేన పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారంటూ ప్రచారం చేశాయి. ఈ ప్రచారంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్థులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో స్పందించారు. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, సమాజంలో మంచి మార్పు రావాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని పవన్ పార్టీ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి.. వారిని కలుసుకుని.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్ పార్టీ అభ్యర్థులకు సూచించారు.