CM KCR: పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి ముందు రైతులకు శుభవార్త చెప్పారు. నవంబర్ 8 నుంచి పోడు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. అయితే అలాగే గంజాయి సాగు చేసే పోడు రైతులను హెచ్చరించారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో పోడు భూముల పట్టాలు ఇచ్చేది లేదని తేల్చేశారు. గంజాయి సాగుచేస్తే అన్ని సౌకర్యాలు రద్దు చేస్తామని పేర్కొన్నారు.
87 శాతం అటవీ భూములు 12 జిల్లాలోనే ఉన్నాయని అధికారులు పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ భూములను దట్టమైన అడవులుగా మార్చాలని కోరారు. అడవి మీద ఆధారపడిన గిరిజనులను మేలు చేసేలా ఉండాలన్నారు. అడవులను నాశనం చేసే శక్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం కేసీఆర్ గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, రైతు బీమా రద్దు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. ఆర్ఓఎఫ్ఆర్ఓలో గంజాయి సాగు చేస్తే.. వారి పట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్న సీఎం.. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని అన్నారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి తగిన ప్రణాళికను సిద్దం చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.