
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2010 ఐఏఎస్ కేడర్‌కు చెందిన రాహుల్ బొజ్జా.. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ నియమించింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తూనే అదనపు బాధ్యతలు నిర్వహించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో వెంటనే విధుల్లో చేరాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.