Vakeel Saab: ‘వకీల్ సాబ్’ చుట్టూ పొలిటికల్ పంచ్‌లు.. బుల్లెట్ల మాదిరిగా పేలిన డైలాగులు.. జంక్షన్‌లో పవన్

|

Apr 09, 2021 | 7:49 PM

మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కు చక్కని విందు దొరికింది. తమ అభిమాన నటుడి సినిమా వకీల్ సాబ్ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా...

Vakeel Saab: వకీల్ సాబ్ చుట్టూ పొలిటికల్ పంచ్‌లు.. బుల్లెట్ల మాదిరిగా పేలిన డైలాగులు.. జంక్షన్‌లో పవన్
Vakeel Saab
Follow us on

మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కు చక్కని విందు దొరికింది. తమ అభిమాన నటుడి సినిమా వకీల్ సాబ్ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు ద‌గ్గర పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. సినిమాను కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇంతకీ ఏంటా వివాదం? పవన్ సినిమాకే ఎందుకు అలా జరుగుతోంది.

అమెరికా నుంచి అంబర్ పేట వరకూ అంతర్జాతీయంగా వకీల్ సాబ్ రిలీజైంది. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డ్‌లు షేక్ అవుతున్నాయి. టాలీవుడ్ స్క్రీన్ షేక్ అవుతోంది. థియేటర్ల దగ్గర అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఏపీలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడ సినిమా విషయంలో ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందురోజు రాత్రి ఏపీ ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. సినిమా టికెట్లను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లోని మల్టిప్లెక్స్‌ల్లో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు 250 రూపాయలు మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి.

సింగిల్ థియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. వంద మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర అరవై రూపాయలుగా నిర్ణయించింది. ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో కొంచెం అటూ.. ఇటూగా ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో ఇంకాస్త తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిబంధనలు ఉంచింది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ జీవో విడుదల కావడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వకీల్‌ సాబ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తిరుపతిలో బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ల‌పై పవన్ అభిమానలు దాడి కూడా చేశారు. కిటికీలు, సీట్లు ధ్వంసం చేశారు.

టికెట్ల అంశంపై నిన్న థియేటర్ల యజమానులు ప్రెస్ మీట్ పెట్టడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన వారం లేదా రెండు వారాలు టిక్కెట్ రేట్ల పెంపు ఉంటుంది. ఆ విషయం థియేటర్ యాజమాన్యాలకు తెలియని విషయమేమీ కాదు. అయినప్పటికీ.. వారు ప్రెస్‌మీట్ పెట్టి టిక్కెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది వకీల్ సాబ్ ఫ్యాన్స్ ఆరోపణ. పవన్ సినిమాల విషయంలో తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడబోమని.. కొడాలి నాని సహా పలువురు మంత్రులు, నేతలు సమయం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు.. భారీ ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ.. ప్రభుత్వం చివరి క్షణంలో షాక్ ఇచ్చింది. అదనపు షోలు వేయడానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకపోగా… టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో సినిమా ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది.

వాస్తవానికి కరోనా తర్వాత విడుదలైన కొన్ని సినిమాల టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు ఇటీవల ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. కరోనా నుంచి థియేటర్ యజమానులు బయటపడేందుకు రెండు రోజుల కిందట.. ఏపీ సర్కార్ ఓ ప్యాకేజీని ప్రకటించింది. టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అనుకున్నారు. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా విషయంలో ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ఎంపీ నందిగం సురేశ్. సినిమాలో సబ్జెక్ట్ లేకనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో బెనిఫిట్ షోకు టికెట్లు కొనేవారే లేరన్నారాయన. సినిమా హైప్ కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చాదస్తం మొగుడు.. చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టుగా పవన్ తీరు ఉందన్నారు ఎంపీ.

ఈ వివాదంపై బీజేపీ నేత సునీల్ ధియోధర్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. వకీల్ సాబ్ ఫ్యాన్స్ షోని కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారాయన. సునీల్ దేవధర్ ఆరోపణలపై మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. సినిమాలతో ఆయనకేం సంబంధం అన్ని నిలదీశారు. బెనిఫిట్ షో పేరుతో సామాన్యులని దోచుకుంటుంటే.. పర్మీషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగానే అదనపు షోకు పర్మీషన్ ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. కానీ పవన్ అభిమానులు, జనసేన నేతలు మాత్రం అధికారుల వివరణకు కన్విన్స్ అవడం లేదు. కుట్ర పూరితంగానే సినిమాపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు