
తనకు కేటాయించిన సహయక సిబ్బందిని తగ్గించవద్దంటూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పీఎంఓ కార్యాలయానికి రెండోసారి లేఖ రాశారు. గతంలో తనకు 14 మంది సిబ్బంది ఉండేవారని.. ఆ సంఖ్యను ఐదుకు తగ్గించవద్దని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే నిబంధనల ప్రకారం మాజీ ప్రధానులకు 14 మంది సిబ్బందిని కేటాయిస్తారు… ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆ సిబ్బంది సంఖ్యను ఐదుకు కుదిస్తారు. కానీ మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఐదేళ్ల తర్వాత కూడా ఆయన సూచన మేరకు 12 మంది సహాయక సిబ్బందిని కేటాయించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తనకు కూడా అదే సూత్రాన్ని కేంద్రం పాటించాలని కోరారు. పూర్తి స్థాయి సహాయ సిబ్బందిని కోరుతూ కేంద్రానికి గతంలోనే లేఖ రాశానని.. కానీ తన విజ్ఞప్తిని పట్టించుకోకుండా సిబ్బందిని కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే నాలుగు రోజుల ముందు తన సహాయ సిబ్బందిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇప్పటికైనా పూర్తిస్థాయి సహాయ సిబ్బందిని కేటాయించాలని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.