అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. యూపీ రాముడు మనకెందుకు..? మనకు ఊరికో రాముడు ఉన్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో విద్యాసాగర్‌రావుకే కాకుండా ఇటు టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ నేతలు విమర్శల దాడి పెంచారు.
రామ మందిరంపై కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే రాముడిపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదన్నారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు. కేవలం రాముడిని రాజకీయం చేస్తున్న బీజేపీ నేతల తీరునే ప్రశ్నించానని స్పష్టం చేశారు.
విరాళాల పుస్తకం ఇస్తే.. తానే ముందుడి సేకరిస్తానంటూ విద్యాసాగర్‌రావు చెప్పుకొచ్చారు. అంతే కాదు విరాళాలు తీసుకుని అయోధ్యకు కూడా వెళ్తానన్నారు. అయోధ్య రాముడు మనకెందు అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఇప్పుడు విరాళాలతో అయోధ్య వెళ్తాననడం ఆసక్తిని రేపుతుంది. వివాదాస్పద కామెంట్లపై పార్టీ అధిష్టానం అక్షింతలు వేసిందనే ప్రచారం జరుగుతుంది.