ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ అయ్యింది. రాష్ట్రం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి విశ్వరూప్ విమర్శించారు.
ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదంటే దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధంచేసుకోవచ్చని విశ్వరూప్ తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ కేసులు సత్వరం విచారణ చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని చెప్పారు.
భూమి లేని చోట భూసేకరణ చేసయినా భూమి ఇవ్వాలని సూచించారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందాలని సీఎం సూచించారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ తమను ఆదేశించినట్లు విశ్వరూప్ చెప్పారు. కలెక్టర్, ఎస్పీ కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కలిపిచాలని చెప్పారు. పోలీసులే ముద్దాయిలుగా ఉన్న కేసుల్లో ఏకంగా పోలీసులను జైలుకు పంపాలని ఆదేశించినట్లు విశ్వరూప్ చెప్పారు.
రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు తగ్గాయని హోం మంత్రి సూచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందని అన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని అన్నారు. గతంలో 3.6 శాతం కేసులు విచారణ పూర్తి అయితే ఇప్పుడు అది 7 శాతం వరకుకు పెరిగిందని సుచరిత తెలిపారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని హోంమంత్రి సుచరిత చెప్పారు. దళితుల్లో, గిరిజనుల్లో ఈ సమావేశాల వల్ల ఆత్మస్థైర్యం పెపొందుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more: