ఏడవ విడత హరితహారంపై సమీక్ష.. వీలైనన్ని పెద్ద మొక్కలను అన్ని శాఖల నర్సరీల్లో సిద్ధం చేయాలని ఆదేశం

|

Feb 24, 2021 | 4:22 PM

రానున్న సీజన్ లో నిర్వహించనున్న ఏడవ విడత తెలంగాణకు హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం అరణ్య భవన్ లో..

ఏడవ విడత హరితహారంపై సమీక్ష..  వీలైనన్ని పెద్ద మొక్కలను అన్ని శాఖల నర్సరీల్లో సిద్ధం చేయాలని ఆదేశం
Follow us on

రానున్న సీజన్ లో నిర్వహించనున్న ఏడవ విడత తెలంగాణకు హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం అరణ్య భవన్ లో జరిగింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, మున్సిపల్ శాఖ కమిషనర్ ఎన్. సత్యనారాయణ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. దోబ్రియల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, హార్టీకల్చర్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రానున్న వర్షాకాలం సీజన్ లో మొదలు కానున్న ఏడవ విడత హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై ప్రధానంగా అధికారులు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా నాటిన మొక్కలు (ఆరు విడతల్లో 210.85 కోట్లు), ఎదుగుతున్నతీరు, ఎండాకాలంలో నీటి వసతి ఏర్పాటు, శాఖల మధ్య సమస్వయం, నర్సరీల సంసిద్దత, పెద్ద మొక్కల లభ్యతపై ప్రధానంగా సమీక్ష జరిగింది. ఈయేడాది (2021-22) సుమారు ఇరవై కోట్ల మొక్కలు (19.91 కోట్లు) రాష్ట్ర వ్యాప్తంగా నాటాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఊరికి ఒక నర్సరీ ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుతం రాష్ట్రంలో నర్సరీల సంఖ్య 14,924 కు చేరింది. ( దీనిలో పంచాయితీ రాజ్ – 12,753 నర్సరీలను, అటవీ శాఖ – 518, మున్సిపల్ శాఖ – 1018, జీహెచ్ఎంసీ -600 , హెచ్ఎండీయే -35 నర్సరీలను నిర్వహిస్తున్నాయి.) ఆరవ విడత హరితహారం మొత్తం లక్ష్యం 29.86 కోట్లు కాగా తొంభై శాతం 27.31 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు వివరించారు.

ఎండాకాలం సమీపిస్తున్నందున మొక్కల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సౌకర్యం కల్పించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సంబంధిత శాఖలను కోరారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్యయం ద్వారా మొక్కలు బతికే శాతాన్ని సాధ్యమైనంతంగా పెంచాలని కోరారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, స్ఫూర్తితో హరిత తెలంగాణకు సమిష్టిగా పనిచేయాలన్నారు.

బహుల రహదారి వనాల కోసం (మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్) వీలైనన్ని పెద్ద మొక్కలను అన్ని శాఖల నర్సరీల్లో సిద్ద చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, విభిన్న, నాణ్యమైన మొక్కలను సిద్దం చేసే తీరు అటవీశాఖ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. అన్ని స్థాయిల్లో రోడ్ల వెంట (జాతీయ, రాష్ట్ర, పంచాయితీ రాజ్) రహదారి వనాల కోసం ఒక ఏడాది ముందుగా సిద్దం కావాలని, వచ్చే యేడాదికి (2022) అవసరమైన ప్లాంటేషన్ ను ఇప్పటి నుంచే నర్సరీల్లో సిద్దం చేయటం మంచిదని పీసీసీఎఫ్ ఆర్. శోభ సూచించారు.

Read more:

తమ రక్తంలోనే ప్రజా సేవ ఉందన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పిన వాణిదేవి