
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ స్పందించారు. తెలుగు ప్రజలపై మోదీ విషం చిమ్ముతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల జీవనాడి అన్న ఉమ.. ప్రధాని ఇక్కడకు ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. పోలవరం నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ప్రధాని ఆరోపిస్తున్నారని.. కానీ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రాజెక్ట్‌ను ప్రశంసిస్తున్నాయని దేవినేని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ళుగా కార్యరూపం దాల్చని పోలవరాన్ని చంద్రబాబు పూర్తి చేస్తున్నారని దేవినేని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో ‘పోలవరం ప్రాజెక్టు గత 4 దశాబ్దాలుగా నలుగుతోంది. గత ప్రభుత్వాలు, ఇప్పటి టీడీపీ సర్కారు ఈ పాపంలో భాగస్వాములు, దోషులు. ఈ ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించిన ఈ కేంద్ర ప్రభుత్వం మొదటి కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.7వేల కోట్లు ఇచ్చింది.
పనుల్ని ఆలస్యం చేస్తూ.. ఏదో విధంగా అంచనాలు పెంచాలని కుట్ర చేస్తున్నారు.ఆ ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు లాగడం, అవినీతికి పాల్పడటమే వారి పని. ప్రాజెక్టు అంచనాలు పెంచే కుట్ర చేస్తూ.. యూటర్న్ బాబు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో మీకు తెలుసు. రైతులను, ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారనడానికి పోలవరం ప్రాజెక్టే ఒక సజీవ ఉదాహరణ’ అంటూ మోదీ ఆరోపణలు చేశారు.