దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపినీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులు, నేతలు, సెలబ్రిటీస్ కరోనా టీకా వేయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాల్సింది వృద్ధులకు కాదు.. యువతకు అని ఆయన చెప్పారు. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారా అని ప్రశ్నించగా.. నా వయసు ఇప్పటికే 70 దాటింది. వ్యాక్సిన్‌ను ముందుగా ఎక్కువ జీవితకాలం ఉన్న యువతీయువకులు ఇవ్వాలి. నేను మహా అయితే మరో 10, 15 ఏళ్లు ఉంటాను అని ఖర్గే అనడం గమనార్హం.
దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారికి రెండో దశలో భాగంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇక మల్లికార్జున ఖర్గే బాటలోనే హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి నడిచారు. నాకు కూడా వ్యాక్సిన్ అవసరం లేదన్నారు హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్. అయితే అయన ఇప్పటికే కొవిడ్-19 బారిన పడి కోలుకోవడం గమనార్హం. అయినప్పటికీ తనకు వ్యాక్సిన్ అవసరం లేదని అన్నారు. కొవిడ్ వచ్చిన తర్వాతో తనలో యాంటీబాడీల సంఖ్య 300 వరకూ ఉన్నదని, ఇది చాలా ఎక్కువని ఆయన చెప్పారు.
ఇప్పటికిప్పుడు తనకు వ్యాక్సిన్ అవసరం లేదని ఆయన అన్నారు. ఈయన గతేడాది నవంబర్ 20న కొవాగ్జిన్ ట్రయల్ డోస్ తీసుకున్నారు. అయితే డిసెంబర్ 5న కరోనా బారిన పడిఆసుపత్రిలో చేరారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి టీకా కోసం క్యూ కడుతున్న తరుణంలో ఇలా ఈ నేతలు కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేక పోర్టల్:
దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారికి, ఇతర రోగాలు ఉన్న 45 నుంచి 59 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు Co-WIN ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. Co-WIN 2.0 వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో లేదా ఆన్‌లైన్‌లో Co-WIN App లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ప్లేస్టోర్‌లో కనిపించే Co-WIN App కేవలం అధికారుల కోసం మాత్రమే. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారికి కాదు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు కేవలం https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లోనే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా ఫోన్ చేసినా, మీ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ వెబ్‌సైట్ తప్ప మరే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండదు. నకిలీ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి మీ వివరాలు ఇచ్చి మోసపోవద్దు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా ముగ్గురి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మొదటి డోస్, రెండో డోస్‌కు స్లాట్స్ బుక్ చేయొచ్చు.
Read more: