Minister Peddireddy: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమలైలోని సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు లోక్ సభ ప్రొటెం స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల ధరించిన మంత్రి పెద్దిరెడ్డి.. వీరిద్దరితో పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల జిల్లాల డ్వామా పీడీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
‘జగనన్న పచ్చతోరణం’లో భాగంగా ఎక్కడైనా గ్రామాల్లో నాటిన మొక్కలు చనిపోతే ఆయా సర్పంచ్‌లు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 31 నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా చూసుకోవాలన్నారు. అమరరాజా బ్యాటరీస్ కంపెనీ వ్యవహరంపై కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కంపెనీ ఏపి నుంచి ఇంకో రాష్ట్రానికి తరలిపోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. లాభాల కోసమే ఇతర రాష్ట్రాలకు వేళ్లాలని ఆ కంపెనీ భావిస్తోందని.. రీలోకేట్ చేయాలంటే చిత్తూరులోనే వేరే చోట 5 వేల ఎకరాలు కంపెనీకి ఉందని.. అక్కడికి తరలించవచ్చన్నారు. నిబంధనల ప్రకారం రీలోకేషన్ చేయాల్సి ఉంటుందన్నారు మంత్రి. కంపెనీ పొరుగు రాష్ట్రాల ఇన్సెంటివ్స్ కోసం వెళితే ఏమి చేయాలని ప్రశ్నించారు. మంత్రి సజ్జల అమరరాజా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదని.. ఈ వ్యవహారంపై సజ్జల కూడా వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.