బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల్లో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ముందుగా.. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న భవిష్యత్ కాలంలో.. ఇంగ్లీషు భాష ముఖ్యమని.. ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లల్ని చదివించాలని అన్నారు. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని పేర్కొన్నారు. అందుకే.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు భాష ఖచ్చితంగా ఉండాలని అన్నారు.
పాత గోడలు.. పెచ్చులూడే స్లాబ్‌లు, పాడుబడ్డ బంగ్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంలో విద్యార్థులు ఉంటున్నారు.. ఇవీ.. నిన్నటి వరకు ఇదీ పాఠశాలల పరిస్థితి. ఇకపై ఇలా ఉండకూడదని.. మన స్కూల్స్ రూపురేఖలు మారబోతున్నాయన్నారు.
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.. ఏపీలో ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు భాగాలుగా విభజించి, మొదటి దశలో 15 వేల స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతీ పాఠశాలలో ఈ కింద తెలిపిన వసతులు ఖచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ప్రభుత్వ పాఠశాలల్లో 9 వసతులు:
1. రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు
2. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్లు
3. రక్షిత తాగునీరు
4. విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్
5. మొత్తం పాఠశాలకు పెయింటింగ్
6. మేజర్, మైనర్ మరమ్మతులు
7. గ్రీన్ చాక్ బోర్డ్ లు
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ గోడ నిర్మాణం