
నవంబర్ నుంచి జనవరి వరకు ఉండే తీవ్రమైన చలి, పొగమంచు వల్ల మొక్క నిద్రావస్థలోకి వెళ్లడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంట్లో తయారుచేసే సహజ ఎరువును అందిస్తే చలికాలంలోనూ తులసిని పచ్చగా కాపాడుకోవచ్చు.

ముందుగా శీతాకాలంలో తులసి మొక్క విషయంలో చేయకూడని పనులు తెలుసుకోవాలి. ఈ సీజన్లో మొక్కను వేరే కుండీలోకి మార్చడం, వేర్లను కత్తిరించడం లేదా కొమ్మలను విరవడం వంటివి అస్సలు చేయకూడదు; అలా చేస్తే కొమ్మలు ఎండిపోతాయి. అలాగే పచ్చగా ఉన్న తులసి మంజరులను కట్ చేయకూడదు, కేవలం పూర్తిగా ఎండిపోయిన పువ్వులను మాత్రమే చేతితో సున్నితంగా తొలగించి విత్తనాలను దాచుకోవాలి.

తులసి మొక్కకు అత్యంత ప్రమాదకరమైనది రాత్రిపూట కురిసే పొగమంచు. కాబట్టి మొక్కపై నేరుగా మంచు పడకుండా పైన షేడ్ ఉండే చోట ఉంచాలి లేదా రాత్రివేళ పలుచటి గుడ్డతో కప్పాలి. అదే సమయంలో ఉదయం పూట కనీసం రెండు మూడు గంటల ఎండ తగిలేలా చూడాలి. నీళ్లు కూడా చాలా తక్కువగా పోయాలి;

కుండీలోని పైమట్టి పూర్తిగా ఆరిన తర్వాతే నీరు ఇవ్వాలి, లేదంటే వేర్లు కుళ్లిపోతాయి. ఆకులపై నీళ్లు చల్లడం కూడా ఆపేయాలి. వారానికి ఒకసారి మట్టిని గుల్లగా కదిలిస్తే వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది.

ఇక చలి షాక్ నుంచి మొక్కను రక్షించడానికి ఇంట్లోనే ఒక అద్భుతమైన ఆర్గానిక్ ఎరువు తయారు చేసుకోవచ్చు. దీనికోసం కొద్దిగా ఆవు పేడ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్, బాగా ఎండబెట్టిన అరటి తొక్కల పొడి మరియు అర చెంచా పసుపు పొడిని నీటిలో వేసి 24 నుంచి 48 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ ద్రావణాన్ని వడపోసి, ఒక వంతు ఎరువుకు మూడు వంతుల నీరు కలిపి నెలకు ఒకసారి మొక్క మొదట్లో పోయాలి. ఎండిన అరటి తొక్కల పొటాషియం మొక్కకు బలాన్నిస్తే, పసుపు మట్టిలో ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఈ సూచనలు పాటిస్తే మీ తులసి మొక్క శీతాకాలాన్ని తట్టుకుని నిత్యం పచ్చగా ఉంటుంది.