
ప్రకృతి మనకు ఎన్నో ఉపయోగకరమైన పండ్లు, ఆకుకూరలు ఇస్తుంది. కానీ ప్రకృతి మన నుండి ప్రతిఫలంగా ఏమీ అడగదు. కొన్ని మొక్కలు, చెట్లు కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పుదీనా మొక్కలు పెంచుకుంటే దానివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.

పుదీనాలో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. దీని ఆకులు కూరల్లో వేస్తే ఘుమ ఘుమలే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అంతేనా పుదీనా ఆకులతో డీటాక్స్ వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు. శరీరంలో ఆహార వ్యర్థాలు, మందుల తాలూకు రసాయనాలు టాక్సిన్లుగా ఉండిపోతాయి.

అప్పుడప్పుడూ అయినా శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరం. అందుకోసం పుదీనా నీళ్లు చక్కగా పనిచేస్తాయి. ఓ గాజు సీసాలో కొన్ని పుదీనా ఆకులు, చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలూ వేసి నీళ్లు పోయండి. గంట తరువాత ఆ నీటిని కొద్దికొద్దిగా తాగి చూడండి. అలసట ఎగిరిపోతుంది. శరీరం తేలికపడుతుంది.

పుదీనా ఆకులకు ఆయుర్వేద ప్రాముఖ్యత ఉంది. పుదీనా ఆకులను తినడం వల్ల శరీరంలో అనేక సానుకూల, మంచి మార్పులు వస్తాయని చెబుతారు. ఈ మార్పులలో మొదటిది జీర్ణక్రియను మెరుగుపరచడం. పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

ఉదయాన్నే పరగడుపున పుదీనా నీళ్ళు తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. పుదీనా ఆకులు శరీరంలో నీరు నష్టపోకుండా చేస్తాయి. శరీరం డీహైడ్రేట్ అవ్వదు. పుదీనా నీళ్లు తాగితే రోజంతా తాజాగా ఉంటాం. శరీరం అలసిపోదు. పుదీనా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇది అలసటను కూడా తగ్గిస్తుంది. పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా నీళ్ళు తాగడం వల్ల వేసవిలో చెమట దుర్వాసన రాకుండా ఉంటుంది.