
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో పదహారు చిరుత పిల్లలు జన్మించాయి. వాటిలో ఒకటైన ముఖి యుక్తవయస్సుకు చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. భారతదేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ముఖి పరిపక్వతతో విజయవంతమైంది. నమీబియా నుండి దిగుమతి చేసుకున్న జ్వాలా అనే ఆడ చిరుత మార్చి 29, 2023న ముఖికి జన్మనిచ్చింది.

చీతా కన్జర్వేషన్ ఫండ్ నివేదిక ప్రకారం, చిరుతలు జీవితంలో మూడు దశల ఉంటాయి. మొదటిది, అవి పుట్టినప్పటి నుండి 18 నెలల వయస్సు వరకు పిల్లలు. కౌమారదశ 18 నుండి 24 నెలల వరకు ఉంటుంది. 24 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత వాటిని పెద్దలుగా భావిస్తారు. ఒక చిరుత జీవిత కాలం కేవలం 10 నుండి 12 సంవత్సరాలే ఉంటుంది

ఈ చిరుతలు అవి పెద్దయ్యాక వేటాడటం నేర్చుకుంటాయి. అలాగే స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతాయి. మగ చిరుతలు సాధారణంగా ఆడ చిరుతల కంటే పెద్దవిగా ఉంటాయి, పెద్ద తలలు కలిగి ఉంటాయి. చిరుతలు సన్నని శరీరాలు, లోతైన ఛాతీని కలిగి ఉంటాయి. వాటి పెద్ద నాసికా రంధ్రాలు శరీరానికి ఆక్సిజన్‌ను వేగంగా పంపిణీ చేయడంలో సహాయపడతాయి.

చిరుతను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు అని ఊరికే అనరు. ఎందుకంటే ఇది గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఇది కేవలం మూడు సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

వీటి కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తాయి. చిరుతను దాని కళ్ళ కింద ఉన్న నల్లటి మచ్చల ద్వారా గుర్తించవచ్చు, వీటిని కన్నీటి గుర్తులు అంటారు. అవి కళ్ళను సూర్యకాంతి నుండి రక్షిస్తాయి.