
ప్రపంచవ్యాప్తంగా మాంసాహారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా చాలా మంది చికెన్ లేదా మటన్ తినడానికే మొగ్గు చూపుతారు. కానీ ఒక దేశం మాత్రం ఇందుకు భిన్నం.. అక్కడ ప్రజలు చికెన్ కంటే ఎక్కువగా చేపలనే లాగించేస్తుంటారు. ఆ దేశమే.. డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచంలోనే అత్యధికంగా చేపలను వినియోగించే దేశంగా చైనా రికార్డు సృష్టించింది.

చేపల వేటలోనూ: చైనాకు ఉన్న సుదీర్ఘమైన తీరప్రాంతం ఆ దేశపు ఆహార సంస్కృతిని మార్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు చైనా. ఇక్కడ ఆక్వాకల్చర్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనీయుల సంప్రదాయ వంటకాల్లో చేపలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. తీరప్రాంత ప్రజలకైతే చేపల వేటే ప్రధాన జీవనాధారం. చైనా కేవలం తన అవసరాలకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు చేపలను భారీగా ఎగుమతి చేస్తోంది.

జపాన్ మరో రికార్డ్: మొత్తం వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. తలసరి వినియోగంలో మాత్రం జపాన్ అగ్రస్థానంలో ఉంది. జపాన్ ప్రజలు సుషీ వంటి సముద్రపు ఆహారాలను అమితంగా ఇష్టపడతారు. చైనా, జపాన్ తర్వాత ఇండోనేషియా, భారత్, వియత్నాం దేశాలు కూడా చేపల వినియోగంలో టాప్ లిస్టులో ఉన్నాయి.

చేపలు తింటే ఆరోగ్యానికి బూస్ట్: ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల చాలా మంది చికెన్‌ను పక్కన పెట్టి చేపల వైపు మళ్లుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులను నివారిస్తుంది. ఒమేగా-3 యాసిడ్లు దృష్టి లోపాలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

చేపలతో ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. చేపల్లో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలను దృఢంగా మారుస్తాయి. చేపలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దుకే డైటీషియన్లు కూడా సమతుల్య ఆహారంలో భాగంగా వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినాలని సూచిస్తున్నారు.