
వేరుశనగలు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. వేరుశెనగలు గట్టిగా ఉండటం వల్ల, అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

కరోనా అనంతరం ప్రజల్లో ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీంతో చాలా మంది ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలతో పాటు నట్స్, సీడ్స్, డ్రైఫ్రూట్స్‌ని కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. బాదం, పిస్తా వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌కి బదులుగా తక్కువ ధరకు లభించే పల్లీలు తింటే అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు.

సరైన మోతాదులో ప్రతినిత్యం పల్లీలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో పల్లీలు అద్భుతంగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా పని చేయడానికి, ముఖ్యంగా గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో పల్లీలు సహాయం చేస్తాయి. ఫలితంగా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పల్లీలు తినటం వల్ల ట్రిప్టోఫాన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది తరచుగా హ్యాపీ హార్మోన్ అని పిలువబడే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. జింక్ పుష్కలంగా ఉండే వేరుశెనగలు తినటం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది.

పల్లీలల్లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని వల్ల మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు పల్లీలను తినడం వల్ల మెదడును చురుగ్గా ఉంటుంది. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోండి.