
వేసవిలో ద్రాక్ష పంట దండిగా వస్తుంది. ఇవి రుచి తియ్యగా, పుల్లగా, వగరుగా భలేగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. అందుకే రకరకాల జ్యూస్‌లు, మందులు, డిజర్ట్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వేసవిలో ద్రాక్ష మార్కెట్లో పెద్ద మొత్తంలో దర్శనమిస్తాయి. అయితే ద్రాక్ష తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ద్రాక్ష సాగులో కీటకాల నుంచి రక్షించడానికి రైతులు పురుగు మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ రసాయనాలు ద్రాక్ష ఉపరితలంపై అతుక్కుపోయి ఉంటాయి. దీంతో మార్కెట్ నుంచి వీటిని కొనుగోలు చేసిన తర్వాత కేవలం నీటితో కడిగితే సరిపోదు. తద్వారా వీటిపై ఉండే రసాయనాలు పూర్తిగా తొలగిపోవు.

నిర్లక్ష్యంగా అలాగే తినేస్తే ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తే అవి అలెర్జీలు, కడుపు నొప్పులు, తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ద్రాక్షను పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

ద్రాక్షను సరిగ్గా కడిగే పద్ధతి ఒకటి ఉంది. అందుకు ఏం చేయాలంటే.. నీటితో ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత సాధారణ నీటితో మళ్ళీ సరిగ్గా కడగాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు నీటిలోని బ్యాక్టీరియా సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది. రసాయనాలను కూడా పూర్తిగా వదలగొడుతుంది.

ద్రాక్షపై పేరుకుపోయిన రసాయనాలను తొలగించడంలో బేకింగ్ సోడా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ద్రాక్షను ఈ ద్రావణంలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ బేకింగ్ సోడా పురుగుమందుల అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత మంచినీటితో బాగా కడగితే సరి. నీటిలో వెనిగర్ కలిపి అందులో ద్రాక్షను నానబెట్టినా క్రిములను చంపడంలో, ఉపరితలంపై అంటుకున్న అవశేషాలను వదులుకోవడానికి సహాయపడుతుంది.