
ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో విజయం, పురోగతి, ఆనందం కోసం అనేక ఆచరణాత్మక సూత్రాలను ప్రతిపాదించారు. ఒక వ్యక్తి పురోగతికి అతిపెద్ద అడ్డంకి సిగ్గు, సంకోచం, ఇతరులు ఏమంటారోనన్న భయం. ఇటువంటి మనస్తత్వం కారణంగా చాలా మంది తమకు మేలు చేసే పనులను చేయడానికి వెనుకాడతారు.

చాణక్య నీతి ప్రకారం ముఖ్యంగా కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదని సూచిస్తున్నాడు. అవేంటంటే.. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం చాలా ముఖ్యం. ఇచ్చిన డబ్బును తిరిగి అడగడానికి సంకోచిస్తే, ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. అందువల్ల తమ హక్కులను కోరడంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

అలాగే ఆకలి వేసినప్పుడు ఆహారం అడగడానికి,సమయానికి భోజనం చేయడానికి సంకోచించకూడదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఆరోగ్యంగా ఉండటానికి సరైన సమయంలో ఆహారం తీసుకోవడం అవసరం.

జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను చాణక్యుడు కూడా నొక్కి చెబుతాడు. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు, ప్రశ్నలు అడగడానికి లేదా ఇతరుల నుండి జ్ఞానాన్ని పొందడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడకూడదు. వయస్సు, హోదా, సామాజిక స్థాయి కన్నా జ్ఞానమే ముఖ్యం.

అలాగే ఏ విధమైన నిజాయితీ గల పని చేస్తున్నప్పుడు కూడా ఎవరూ తమను తాము తక్కువగా భావించుకోకూడదు. ఈ రోజుల్లో ఏ పనీ చిన్నది, పెద్దది అని లేదు. కష్టపడి, నిజాయితీగా చేసిన ప్రతి పని గౌరవానికి అర్హమైనదే. తన పని పట్ల సిగ్గుపడే వ్యక్తి స్వయం సమృద్ధి సాధించలేడని చాణక్యుడి అభిప్రాయం.