
మొదటిగా చెప్పుకోవలసింది చారిత్రాత్మక గోల్కొండ కోట. పగటిపూట పర్యాటకులతో కిటకిటలాడే ఈ కోట, చీకటి పడగానే భయానక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలం నాటి ఈ కోటలో పూర్వం రాజుల చేతిలో అన్యాయంగా చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికులు నమ్ముతారు. ముఖ్యంగా తారామతి అనే నర్తకి ఆత్మ రాత్రి వేళల్లో ఇక్కడ నృత్యం చేస్తుందని, గాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయనే పుకార్లు ఉన్నాయి. అందువల్లనే సాయంత్రం తర్వాత పర్యాటకులను కోట లోపలికి అనుమతించరు.

మరొక ప్రసిద్ధ ప్రదేశం బంజారాహిల్స్ లోని కుందన్‌బాగ్ హాంటెడ్ హౌస్. ఒకప్పుడు ఈ ఇంట్లో ముగ్గురు మహిళలు వింతగా ప్రవర్తిస్తూ, చేతబడులు చేసేవారని ప్రచారం జరిగింది. వారు చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో రాత్రి పూట కొవ్వొత్తులతో ఎవరో తిరుగుతున్నట్లు వెలుతురు కనిపిస్తుందని చుట్టుపక్కల వారు భయపడేవారు.

అలాగే ఖైరతాబాద్‌లోని పాత సైన్స్ కాలేజ్ భవనం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ భవనం శిథిలావస్థకు చేరిన తర్వాత, అందులోని ల్యాబ్‌లో ఉన్న అస్థిపంజరాలు, మానవ శరీర భాగాలు రాత్రి వేళల్లో కదులుతాయని, అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డులు వింత పరిస్థితుల వల్ల చనిపోయారని కథలు పుట్టాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలోని కొన్ని హోటళ్లు మరియు షూటింగ్ స్పాట్స్ వెనుక కూడా ఇటువంటి కథలు ఉన్నాయి. పూర్వం నిజాం సుల్తానుల యుద్ధభూమిగా ఉన్న ఈ ప్రాంతంలో, షూటింగ్స్ జరిగే సమయంలో లైట్లు అకస్మాత్తుగా పడిపోవడం, అద్దాలపై వింత అక్షరాలు కనిపించడం వంటి సంఘటనలు జరిగాయని కొందరు చెప్తారు.

రవీంద్రనగర్ లో 2012 లో జరిగిన ఆత్మహత్యల పరంపర హైదరాబాద్ లో భయానక ప్రదేశాల జాబితాలో ఒకటిగా ఈ ప్రదేశాన్ని నిలిపింది. ఒక దెయ్యం కారణంగా ఈ ఆత్మహత్యలు జరిగాయని ప్రజలు నమ్ముతారు. తమ ఇళ్లను కాపాడుకోవడానికి ఆ కాలనీ వాసులు రాత్రి వేళల్లో జాగారం కూడా ఉండేవారు. ఆ భయానికి దాదాపు అరడజనుకు పైగా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి. దెయ్యం ప్రధానాంశంగా పలు వార్తా పత్రికల్లో అప్పుడు అనేక ఆర్టికల్స్ ను కూడా ప్రచురించాయి. నేటికి కూడా రాత్రయితే ఈ ప్రదేశం నిర్జనంగా మారిపోతుంది. చాలా ఇళ్లపై ఎర్రని రంగులో జై శ్రీరామ్ అని రాసి ఉండడం గమనించవచ్చు.

మరొకటి హైదరాబాద్ లోని దేద్ లఖ్ ఘర్. లక్ష్మణ్ అనే ఓ వ్యక్తి గొప్ప దేద్ లఖ్ ఘర్ నిర్మాణానికి రూ.1.5 లక్షలు ఉపయోగించారు, అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష్మణ్‌తో ఆవరణలోకి అడుగు పెట్టకముందే అతని భార్య గుండెపోటుతో మరణించింది. ఇంట్లో ఏదో తప్పు జరుగుతోందని మళ్లీ ఇంటికి తిరిగి రాలేదట యజమాని. కొన్ని రోజుల తర్వాత, లక్ష్మణ్ 'దేద్ లఖ్ కా ఘర్'ని ఒక విద్యార్థికి లీజుకు ఇచ్చాడు. కొద్దిరోజులకి భవనంలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. ప్రతి కుటుంబంలోనూ అదే పునరావృతమైంది అని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి ప్రత్యేకంగా ఓ మహిళ ఏడుపు వింత శబ్దాలు వినిపించాయని కూడా వారు పేర్కొన్నారు.

బంజారా హిల్స్ 2వ రోడ్డులోని శ్మశానవాటిక నగరంలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటి. ఆ ప్రదేశం చుట్టూ వీధి దీపాలు అకారణంగా మినుకుమినుకుమవడం, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం, అర్ధరాత్రి అటువైపుగా వెళ్లిన వాహనాలు పాడైపోవడం వంటి భయానక అనుభవాలను ఎదుర్కొన్నారట. అందుకనే అర్ధరాత్రుళ్లు ఈ దెయ్యాల ప్రదేశం దగ్గర తిరగడానికి సాహసించరు.

శంషాబాద్ కు సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గా ప్రసిద్ధి చెందింది. చాలా మంది మరణాలకు దారితీసిన వివాదాల నేపధ్యంలో ఈ విమానాశ్రయం నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బాధితుల మృతదేహాలను విమానాశ్రయం కిందే సమాధి చేశారని, శాంతి లేని వారి ఆత్మలు ఆ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతారు.

అయితే, వీటన్నింటికీ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చాలా వరకు ఇవన్నీ కేవలం మనుషుల భ్రమలు లేదా కథలుగా సృష్టించబడినవే. అయినప్పటికీ, రహస్యాలను ఇష్టపడే వారికి ఈ ప్రదేశాలు ఎల్లప్పుడూ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.