
ఓ యువకుడు రోజు మాదిరిగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ కోసం బయలుదేరుతున్నాడు. ఇంటి నుంచి బయటికి వచ్చి.. షూస్ వేసుకున్నడు. అక్కడే ఉన్న బ్యాగులో గ్లౌస్ పెట్టుకుని బయలుదేరినందుకు సిద్ధమయ్యాడు. బ్యాగు పట్టుకునే సరికి ఏదో కదిలినట్టు అనిపించింది. తెరిచి చూస్తే.. లోపల తిష్ట వేసి కూర్చుంది. వెంటనే కేకలు పెట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు ఆ యువకుడు. తృటిలో పెద్ద ముప్పే తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ సిందియా ప్రాంతంలోని నౌసేనా బాగ్ నేవల్ క్వార్టర్స్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. యువకుడు స్పోర్ట్స్ ప్రాక్టీస్ లో భాగంగా బయలుదేరందుకు సిద్ధమై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న బ్యాగులో గ్లౌస్ పెట్టుకునేందుకు తెరిచాడు. ఆ సమయంలో ఏదో లోపల కదిలినట్టు అనిపించింది.

కాస్త తెరిచి చూస్తే.. లోపల పాము కనిపించింది. దీంతో అవాక్కైనా యువకుడు కేకలు పెట్టాడు. కుటుంబం అప్రమత్తమైంది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగరాజు.. పామును రెస్క్యూ చేశాడు. బ్యాగులో ఉన్న ఆ పాము అత్యంత విషపూరితమైన రక్తపింజరగా పాము గుర్తించాడు.

రక్త పింజర పాము అనేది అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాము. దీనిని శాస్త్రీయంగా 'డాబోయా రస్సెలీ' అంటారు. మన దేశంలో మనుషులకు ఎక్కువగా పాముకాట్లు ప్రాణనష్టానికి కారణమయ్యే పాములలో రక్తపింజర ఒకటి. దీనిని సాధారణంగా 'కాటుక రేకుల పాము' అని కూడా పిలుస్తారు. ముదురు గోధుమ రంగు శరీరం. గొలుసు లాంటి గుండ్రని మచ్చలు కలిగి ఉంటాయి. తల త్రిభుజాకారంలో, వెడల్పుగా అనిపిస్తుంది.

రక్త పింజర పాములు గుడ్లు పెట్టవు.. పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటాయి. ఈ పాము కాటు వేస్తే.. శరీరంలో రక్తం గడ్డకట్టి నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపి ప్రాణాల పైకి తెస్తుంది. శరీరంలో అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది.