
పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది, అలాగే అటుకులు పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎంతో తేలికగా, అమృతతుల్యమైన రుచితో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తయారీకి ముందుగా అర కప్పు (60 గ్రామాలు) పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి.

పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా ఉడికితే పాయసం తింటున్నప్పుడు రుచి బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కరగబెట్టి, జీడిపప్పు, ఎండుద్రాక్షలను దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో అర కప్పు లావు అటుకులు వేసి సన్నటి మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.

అటుకులు వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అర లీటరు చిక్కటి పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించాలి.

పాలు పొంగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పాయసం కాస్త దగ్గరపడిన తర్వాత అందులో నాలుగు దంచిన యాలకులు, రెండు చిటికెల జాజికాయ పొడి వేయాలి. జాజికాయ పొడి వేయడం వల్ల పాయసానికి అద్భుతమైన సువాసన, ప్రత్యేకమైన రుచి లభిస్తాయి.

చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లను నేతితో సహా పాయసంలో వేసి దింపేయాలి. పాయసం దింపిన వెంటనే కాకుండా 15 నుండి 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం చిక్కబడి ఎంతో కమ్మగా మారుతుంది. ఈ సారి పండుగకు ఈ పాయసాన్ని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.