
ముఖం అందం చాలా వరకు కళ్ళు, పెదవులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇంపైన కనుబొమ్మలు కూడా అందాన్ని ఇనుమడిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. మేకప్‌తో కనుబొమ్మలను ఎంత అందంగా తీర్చిదిద్దినా.. సహజంగా వాటిని తీరైన ఆకృతిలో మలచుకుంటే మరింత అందం తోడవుతుంది. పలుచగా ఉన్న కనుబొమ్మలు చిక్కగా, ఒత్తుగా, నల్లగా పెరగాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

మందపాటి నల్లటి కనుబొమ్మలను పొందడానికి స్క్రబ్ చేసుకోవడం చాల అవసరం. ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు, నుదిటి చుట్టూ 20 నుంచి 30 సెకన్ల పాటు మసాజ్ చేసుకోవాలి. అయితే చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

కనుబొమ్మలు సన్నగా, పలుచగా ఉన్నవారు ఆముదం ఉపయోగించవచ్చు. ఆముదంలో 90 శాతం రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ఆముదం నూనెను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. కావాలంటే రోజూ కూడా వాడుకోవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఆముదం కాస్త చిక్కగా ఉంటుంది. కాబట్టి నేరుగా వాడకపోవడమే మంచిది. ఇది చాలా జిడ్డుగా అనిపించవచ్చు. అందువల్లనే దీన్ని కొబ్బరి నూనెలో కలిపి అప్లై చేసుకోవాలి. ఇలా ఇతర నూనెల్లో కలిపి వాడటం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా కనుబొమ్మలు దురద పెట్టినప్పుడు.. గోళ్లతో ఎట్టిపరిస్థితుల్లోనూ గోకకూడదు. ఇలా చేయడం వల్ల కనుబొమ్మల వద్ద ఉన్న జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.