
కావలసిన పదార్థాలు: 1 గిన్నెడు కందిపప్పు, నిమ్మకాయ సైజు రసం తీసి పెట్టుకున్న చింతపండు, పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు కూరగాయ ముక్కలు: ఆనపకాయ, తీపి గుమ్మడికాయ, మునక్కాడ, క్యారెట్, ముల్లంగి, బెండకాయ, నాటు దోసకాయ, 2 నాటు టమోటాలు, 3 పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన చిన్న అల్లం ముక్క, అర టీస్పూన్ పసుపు, 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం - రుచిని బ్యాలెన్స్ చేయడానికి, రుచికి సరిపడా ఉప్పు, తాజా కరివేపాకు, కొత్తిమీర తరుగు

సీక్రెట్ సాంబార్ మసాలా పేస్ట్ కోసం: 1 స్పూన్ నూనె, పావు టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ లేదా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, పావు కప్పు పచ్చికొబ్బరి. ఘుమఘుమలాడే తాలింపు కోసం: 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అర స్పూన్ ఇంగువ - చాలా ముఖ్యం, కరివేపాకు.

తయారీ విధానం: కందిపప్పును కుక్కర్‌లో శుభ్రంగా కడిగి 4 గిన్నెల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మీడియం మంటపై 4 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికించి, పప్పుగుత్తితో పలుకులు లేకుండా మెదుపుకోవాలి. చింతపండును నానబెట్టి పులుసు తీసి ఉంచాలి. పాన్‌లో ఒక స్పూన్ నూనె వేడిచేసి మెంతులు వేసి లేత రంగు వచ్చే వరకు వేపాలి. అందులోనే మినప్పప్పు, మసూర్ దాల్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్‌పై దోరగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అనంతరం పావు కప్పు పచ్చికొబ్బరి వేసి మరో రెండు నిమిషాలు వేపి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.

సాంబార్ పాత్రలో 2 చెంచాల వేరుశనగ నూనె వేసి ఆనపకాయ, గుమ్మడికాయ, మునక్కాడ, క్యారెట్, ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి, దంచిన అల్లం మరియు సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై కలపాలి. మూతపెట్టి 70% మగ్గిన తర్వాత దోసకాయ, బెండకాయ, టమోటా ముక్కలు కూడా వేసి మరో 2-3 నిమిషాలు నూనెలోనే మగ్గించాలి నూనెలో మగ్గితే ముక్కలకు అద్భుతమైన రుచి వస్తుంది; తర్వాత అల్లం ముక్కను తీసేయాలి.

మగ్గిన కూరగాయల్లో ఉడికించిన కందిపప్పు, గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, చింతపండు రసం మరియు తగినన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే పసుపు, బెల్లం తురుము, కరివేపాకు రెమ్మలు వేసి రుచి చూసి ఉప్పు సరిచేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు సాంబార్‌ను చక్కగా మరిగించాలి.

వేరే పాన్‌లో వేరుశనగ నూనె, నెయ్యి వేడిచేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు అర స్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపును మరిగిన సాంబార్‌లో పోసి కలిపి, చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే, ఉత్సవాల్లో వడ్డించే కమ్మటి టెంపుల్ స్టైల్ సాంబార్ సిద్ధం! వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ సాంబార్‌తో వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.