
పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగు చేస్తారు. తాజాగా గోదావరి పరివాహక ప్రాంతం నిర్మల్ జిల్లాలోను పసుపు సాగు పెరుగుతోంది. సాగు పెరగడమే కాదు నాణ్యమైన పచ్చబంగారపు విత్తనాలకు కేరాఫ్ కూడా నిలుస్తోంది. ఈ ప్రాంత రైతులు ఎప్పటికప్పుడు అధునాత పద్ధతులను అవలంబిస్తూ పసుపు పంటలో నాణ్యమైన పంటను ఉత్పత్తి చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో పసుపు విత్తనానికి కేరాప్ గా నిలుస్తోంది లక్ష్మణచందా మండలంలోని కనుకాపూర్. కనకాపూర్ పేరుకు తగ్గట్టుగానే పచ్చబంగారు విత్తనబాండాగారంగా మారుతుంది. గ్రామానికి చెందిన రైతులు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ లో అంక్సాపూర్ గ్రామాలకు వెళ్లి అక్కడ పసుపు విత్తనాన్ని కడైల చొప్పున కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారు.

నిర్మల్ నుంచి మంచిర్యాల్ వెళ్లే జాతీయ రహదారి 61 పై కనకాపూర్ వద్ద ఖరీఫ్ ప్రారంభం కాగానే ఇక్కడ లభించే పసుపు విత్తనాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలోని లక్ష్మణ చందా మామడ దిలావర్పూర్ సారంగాపూర్ మండలాల నుంచి రైతులు వస్తున్నారు. పసుపు విత్తనం ప్రారంభంలో 6000 రూపాయలు ఉండగా నేడు కడాయి 7500 ధర దాటింది. సీజన్లో 200 నుంచి 1000 కడాయిల పసుపు విత్తనం అమ్ముడుపోతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి సుమారు 7 నుంచి 8 కడాయిల పసుపు విత్తనం పండుతుందని రైతులు పేర్కొన్నారు.

పసుపు పంట కోసం ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పసుపు విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడిలో చాల వరకు కోల్పోవడం జరుగుతుంది. విత్తనశుద్ధి చెయ్యడం వలన దుంప కుళ్ళు తెగులు బారి నుండిపంటనురక్షించుకోవచ్చని చెపుతున్నారు నిపుణులు.

పసుపు పంట దిగుబడి పెంచుకునేందుకు రైతులు నూతన పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. తక్కువ సమయం తక్కువ విత్తనంతో బెడ్డు విధానం ద్వారా పసుపు పంట సాగు చేస్తున్నారు ఈ రైతులు. తక్కువ నీరు తక్కువ ఖర్చుతో రెట్టింపు దిగుబడులు వచ్చే బెడ్ విధానం పై రైతులు ఆసక్తి చూపుతున్నారు.