
ఈకామర్స్ సైట్స్ మొదలు, కార్ల తయారీ వరకు ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఇప్పటికే టెక్ దిగ్గజాలన్నీ ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని మొదలు పెట్టేశాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సైతం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐఫోన్, మ్యాక్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది.

ఈ దిశగా ఇప్పటికే కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని టిమ్ కుక్ తెలిపారు. రానున్న ఐఓఎస్ 18 అప్‌డేట్ ఏఐ పవర్‌తో రానుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే శాంసంగ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ సొంత ల్యాంగ్వేజ్ మోడల్స్‌లో ఏఐ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టగా యాపిల్ నుంచి ఎలాంటి ఏఐ అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన చేశారు.

జనరేటివ్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఫీచర్లపై కసరత్తు సాగుతోందని, సంవత్సరాంతానికి ఈ సేవలు కస్టమర్లకు చేరతాయని టిమ్ కుక్ ఇటీవల ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వెల్లడించారు. ఏఐ సహా భవిష్యత్ టెక్నాలజీపై పెట్టుబడులను యాపిల్ కొనసాగిస్తుందని పేర్కొన్నారు.