
ఈ రవ్వ లడ్డూను చాలా తక్కువ పదార్థాలు, వంటింట్లో దొరికేవాటితోనే, తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసుకోవచ్చును. అంతే కాకుండా ఒకసారి దీనిని ఈ విధంగా చేశారో, మళ్లీ మళ్లీ ప్రిపేర్ చేస్తుంటారు. కాగా, ఇప్పుడు దీనికి తయారీకి కావాల్సిన పదర్థాలు చూద్దాం.రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, పంచదార ఒక కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు, జీడిప్పు, ఎండు ద్రాక్ష,యాలకుల పొడి.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కొలతల ప్రకారం రవ్వను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో సరిపడ నెయ్యి వేసి,రవ్వ మాడిపోకుండా మంచిగా పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. అలా చేయడం వలన రవ్వ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా అవి ఎక్కువ రోజులు ఉంటాయి.

ఇప్పుడు రవ్వ వేగిన తర్వాత అందులోనే నెయ్యి వేసి, జీడిప్పు, ఎండు ద్రాక్ష, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఐదు నుంచి పదినిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో వేయాలి. ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేరు చేసి, కొబ్బరి తురుము, రవ్వ రెండింటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో చక్కెర వేసుకొని దానికి సరిపడ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగి, చక్కెర కరిగిన తర్వాత పాకం వస్తుంది. ఎప్పుడూ కూడా రవ్వలడ్డూలకు తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తే లడ్డూలు మంచిగా వస్తాయి. తీగ పాకం వచ్చిన తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని అందులో వేయాలి.

మంటను లోఫ్లేమ్‌లో పెట్టి ఉండలు లేకుండా బాగా కలపాలి. మొత్తం రవ్వ, చక్కెర మిశ్రమం కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇక రవ్వ వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చేసుకోవాలి. లేకపోతే అవి చాలా త్వరగా విరిగిపోతాయి. రవ్వ పొడిబారి లడ్డూలు చుట్టడానికి వీలు కాదు. వేడి వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు తయారు చేసుకోవాలి. తర్వాత వాటిపై ఎండు ద్రాక్ష, జీడిపప్పు పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వలడ్డూలు రెడీ.