
వేసవి కాలం ఆహార పదార్థాలు సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. మనం కిచెన్‌లో చేసే చిన్నపాటి పొరపాటు కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసి తీవ్ర ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు. వండిన ఆహారాన్ని బయట ఉంచినా, కోసిన పండ్లను అలాగే వదిలేసినా, లేదా మిగిలిపోయిన ఆహారాన్ని సరైన సమయంలో ఫ్రిజ్‌లో పెట్టకపోయినా ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుంది.

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆహార భద్రతలో రెండు గంటల నియమం కీలకమైనది. దీని అర్థం, వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రతలో రెండు గంటలకంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. అత్యంత వేడి వాతావరణం, అంటే 32 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతల్లో, ఈ సమయాన్ని ఒక గంటకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, 5 డిగ్రీల నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య సూక్ష్మజీవులు అత్యంత వేగంగా పెరుగుతాయి.దీని వల్ల ఆహారం త్వరగా పాడవుతుంది.

థానేలోని జుపిటర్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్‌గా పనిచేసే డాక్టర్ అమిత్ సరాఫ్ ప్రకారం, సాల్మొనెల్లా, ఈ కోలి, స్టాఫిలోకాకస్ ఆరియస్, క్యాంపిలో బాక్టర్ అనేవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ప్రధాన బ్యాక్టీరియాలు. ముఖ్యంగా బియ్యం, బియ్యం ఆధారిత ఆహారాల్లో ఉండే కొన్ని సూక్ష్మక్రిములు గది ఉష్ణోగ్రతల వద్ద వేగంగా పెరిగి, వేడికి కూడా నశించని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని ఆయన వివరించారు. అందువల్ల, ఆహారం చూడడానికి బాగున్నా, వాసన బాగా వస్తున్నా, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం తినడానికి సురక్షితం కాకపోవచ్చు.

ఆహారం పాడైందని ఎలా గుర్తించాలి?: చాలా సందర్భాల్లో, పాడైన ఆహారం పుల్లగా లేదా వింత వాసన వస్తుంది. జిగటగా మారుతుంది. పెరుగు వంటి ప్యాక్ చేసిన ఆహారాలు ఉబ్బుతాయి. కొన్నింటిపై బూజు పడుతుంది లేదా రంగు మారుతుంది. అయితే, కొన్ని ప్రమాదకరమైన క్రిములు ఎలాంటి గుర్తించదగిన లక్షణాలు లేకుండానే పెరగగలవు కాబట్టి నిల్వ పద్ధతులు చాలా ముఖ్యం.

వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎలా నివారించాలి: ఫుజు పాయిజన్ బారీన పడకుండా ఉండాలంటే.. రోజూ వీలైనంత తాజా ఆహారాన్ని వండుకోవాలి. అలాగే రెండు గంటల నియమం పాటించాలి, వండిన ఆహారాన్ని త్వరగా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక వేళ ఎక్కవ వేడి ఉంటే గంటసేపు మాత్రయే ఉంచాలి. కోసిన పండ్లను వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆహారాన్ని ముట్టుకునే ముందు చేతులను, పాత్రలను శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న లేదా వీధుల్లో బయట తెరిచి ఉంచే ఆహారాన్ని తినకూడదు. మిగిలిపోయిన ఆహారాన్ని తినాలనుకుంటే, పూర్తిగా వెచ్చగా అయ్యేలా సరిగ్గా వేడి చేయాలి. కిచెన్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం పాడైందని అనుమానం వస్తే, దాన్ని తినకపోవడం ఉత్తమం.