
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ రోజురోజుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది. సీన్ నదిలో ఈతకు వెళ్లి బెల్జియంకు చెందిన అథ్లెట్ అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా, మొత్తం బెల్జియన్ జట్టు పారిస్ ఒలింపిక్ క్రీడలలో మిక్స్‌డ్ రిలే ట్రయాథ్లాన్ నుంచి తమ పేరును ఉపసంహరించుకుంది.

వాస్తవానికి మహిళల ట్రయాథ్లాన్ క్రీడలో పాల్గొన్న తమ క్రీడాకారిణి క్లైర్ మిచెల్ అస్వస్థతకు గురైందని బెల్జియం ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఫలితంగా ఇప్పుడు రిలే ట్రయాథ్లాన్ నుంచి మొత్తం జట్టు వైదొలగాల్సి వచ్చిందని కమిటీ పేర్కొంది.

యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో సహా అనేక పోటీలలో పతకాలు సాధించిన 35 ఏళ్ల బెల్జియం అథ్లెట్ మిచెల్ ట్రయాథ్లాన్ క్రీడలో పాల్గొంది. కానీ, సీన్ నదిలో జరిగిన ఈ పోటీ తర్వాత, ఆమె అనారోగ్యానికి గురైంది.

ప్యారిస్ ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు మైఖేల్ అనారోగ్యంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీన్ నదిపై పోటీలు జరుగుతాయని నిర్వాహక కమిటీ తెలిపింది.

ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే, సీన్ నది నీటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. పోటీలు ప్రారంభమయ్యే నాటికి నది నీటి నాణ్యత మెరుగుపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కానీ, నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నది మరింత కలుషితమైంది. ఈ కారణంగానే ముందుగా ట్రయాథ్లాన్ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేశారు.